చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు జిల్లాలోని మూడు చోట్ల పంజా విసిరారు. కేశంపేట మండలం సంతాపూర్, కడ్తాల్ మండలం మక్తమాధారం సమీపంలో ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు పుస్తెల తాళ్లు లాక్కెళ్లారు. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెంలో బాధిత మహిళ అప్రమత్తతతో చోరీ తప్పింది.
కేశంపేట: మనవరాలితో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ ఘటన శనివారం ఉదయం సంతాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సోమరాజు బాలమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల పనులకు వెళ్లిన డబ్బులు తెచ్చుకునేందుకు తన మనవరాలు భవాని (15)తో కలిసి ఇంటి నుంచి గ్రామంలోకి వెళ్తుండగా.. శ్మశానవాటిక సమీపంలోకి చేరుకోగానే నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు బాలమ్మ ముందు వాహనం నిలిపారు. వెనక కూర్చున్న వ్యక్తి కొల్లాపూర్ ఎలా వెళ్లాలి..? అని అడుగుతూనే.. రెప్పపాటులో బాలమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడును లాగేశాడు. ఊహించని ఈపరిణామంతో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు పెద్దగా అరవడంతో దుండగులు మక్తమాధారం వైపు పారిపోయారు. నిందితులిద్దరూ నలుపురంగు మాస్కులు ధరించారని, వీరి వయస్సు సుమారు 40 సంవత్సరాల లోపు ఉంటుందని బాలమ్మ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ గ్రామానికి వెళ్లి, బాధితురాలితో మాట్లాడి,
వివరాలు తెలుసుకున్నారు.
సాయిరెడ్డిగూడెంలో..
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిందం మంజుల శనివారం ఉదయం కాలినడకన ఇంటి నుంచి పొలానికి వెళ్తోంది. మార్గమధ్యలో మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మంజుల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించడానికి ప్రయత్నించగా, వెంటనే అప్రమత్తమైన మంజుల గట్టిగా కేకలు వేసింది. ఈ సమయంలో రోడ్డు పైనుంచి ఆటో రావడం, సమీపంలోని రైతులు రావడాన్ని గమనించిన దుండగుడు ముచ్చర్ల వైపు పారిపోయాడు. ఈ ఘటనలతో గ్రామీణ మహిళలు, పొలాల వద్దకు వెళ్తున్న కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రెండు చోట్ల మహిళల మెడలోంచి పుస్తెల తాళ్ల చోరీ
మరోచోట దోపిడీకి యత్నించి విఫలం
రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దాడులు
ఆందోళనలో గ్రామీణ ప్రజలు


