తాండూరు: కాగ్నానదిలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల సీజ్ చేశామని తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్‌గౌడ్ శనివారం పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి రెండు వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో మూడు ట్రాక్టర్లను పట్టుకొని అప్పగించారన్నారు. మొత్తం ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని స్పష్టంచేశారు. ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా, యువకుడికి గాయాలయ్యాయి. శనివారం ఈ సంఘటన తిమ్మాపూర్ సమీపంలోని హెచ్‌ఐఎల్ పరిశ్రమ వద్ద చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని శాసీ్త్రపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్‌నుమాకు చెందిన మునీర్(24)కు వివాహం నిశ్చయం కాగా, ఇటీవల ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. ఈక్రమంలో కాబోయే దంపతులు మొక్కులో భాగంగా ఇద్దరి ఇళ్లలో చెప్పి, నగరం నుంచి బైక్‌పై జేపీదర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, హెచ్‌ఐఎల్ సమీపంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉన్మీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుడికి విద్యుత్ షాక్
షాద్‌నగర్: కరెంట్ షాక్‌కు గురైన మున్సిపల్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపాలిటీ విద్యుత్ విభాగంలో పని చేస్తున్న భూషణ్ లింగం శనివారం ఉదయం పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ పాఠశాల సమీపంలో స్తంభం పైకెక్కి లైట్లకు మరమ్మతులు చేస్తున్నాడు. ఈసమయంలో ఒక్కసారిగా షాక్ రావడంతో నిచ్చెన పైనుంచి కిందపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానిక కౌన్సిలర్ రాజునాయక్ అతనికి సీపీఆర్ చేసి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ అందె మోహన్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖదీర్, ఏఈ ఇలియాస్ తదితరులు బాధితుడిని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శంషాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
విత్తన మేళాను
విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: అన్ని రైతు వేదికల్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఏర్పాటు చేయనున్న విత్తన మేళాను విజయయంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత కోరారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటే వేసుకోవాలని రైతులకు సూచించారు. కంది, పెసర, ఆముదం, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు.
డిగ్రీలో ప్రవేశానికి నేడు చివరి అవకాశం
షాద్‌నగర్: గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షాద్‌నగర్‌లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ఆదివారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ, ఎంజెడ్‌సీ, బీజెడ్‌సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కెమిస్ట్రీ కోర్సులు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 97034 41345, 81252 14019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


