కొత్తూరు: సోషల్‌మీడియా వినియోగంపై విద్యార్థులు నియంత్రణ పాటించాలని షాద్‌నగర్ డీసీపీ శిరీష సూచించారు. పట్టణంలోని కేజీబీవీ హాస్టల్, కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో చదువుకున్న వారికే అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గ్రహించి చదువుపై దృష్టి సారించాలని అన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా అతి వినియోగంతో చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే సమస్యలను వివరించారు. సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల ఛేదనలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


