గడువులోపు పూర్తి
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. భవిష్యత్‌లో పట్టణం అధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందడంతో పాటు ‘కొడంగల్ కోవెల.. రెండో తిరుమల’గా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన శిల్పులు ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. గతంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని కృష్ణ శిలలతో నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో టీటీడీ తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఈ ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా శ్రీవారి ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, అన్నదాన సత్రం, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు, మాడ వీధుల విస్తరణ తదితర పనులు చేపట్టనున్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు, ఆలయ నిర్మాణ స్తపతులు, శిల్పులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
ఆలయ ప్రాశస్త్యం
దివంగత నందారం మిడిదొడ్డి నర్సింలు గుప్తా 1970లో ఈ ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు నిత్య ధూపదీప నైవేద్యాలు, కై ంకర్యాలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఉత్సవాలతో ఆలయం నిత్య నూతనంగా అలరారుతోంది. భక్తులకు మెరుగైన వసతులు కల్పించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సమీపంలో 96 మంది నుంచి స్థలాలను సేకరించి పరిహారం అందించారు. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు దిక్కులా రాజగోపురాలు, ప్రధాన ఆలయం సమీపంలో బేడి ఆంజనేయ స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాలు, రథశాల, వాహనశాల నిర్మిస్తారు. శ్రీవారి గర్భగుడికి కుడి పక్కన శ్రీమహాలక్ష్మి అమ్మవారు, ఎడమ వైపు పద్మావతి అమ్మవారు, ముందు భాగంలో గరుడాళ్వార్ ఆలయాలు నిర్మిస్తారు. ఆలయం వెలుపల వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, కల్యాణకట్ట, పరిపాలనా భవనం, వంటశాల, అన్నదాన సత్రం, మాఢవీధులు నిర్మిస్తారు.
ఆ దేవుని ఆదేశంతోనే..
శ్రీవారి ఆలయాన్ని పునఃనిర్మించే భాగ్యం తనకు కలిగినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆ దేవుడి ఆదేశం మేరకు శ్రీవారి ఆలయ నవీకరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి డిసెంబర్ 2027 వరకు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 మే 8న ఆలయ నవీకరణ పనులకు సీఎం ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని బాలాజీనగర్‌లో నిర్మిస్తున్న పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నమూనాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
వేంకటేశ్వర ఆలయానికి తిరుమల తరహా హంగులు
ఆలయ నవీకరణ పనులకు రూ.110 కోట్లు
కృష్ణ శిలలతో ఆలయ పునఃనిర్మాణం
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనులు వేగిరం
శ్రీవారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెండేళ్ల లోపు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. అందుకు అన్ని శాఖల అధికారులు పని చేస్తున్నారు. భక్తుల కోరిక మేరకు త్వరలో పనులు పూర్తి చేస్తాం. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.
– తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కొడంగల్


