షాద్‌నగర్: తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల వీరుల ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సాధనలో భాగంగా ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచం గుర్తించిందన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు షాద్‌నగర్‌లో 20 ఎకరాల భూమిని త్వరలో కేటాయిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు శంకరమ్మ, మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, బీష్వ కిష్టయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యాంసుందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
మహనీయుల విగ్రహాలు ఆవిష్కణ
పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ అబ్దుల్ కలాం, బూర్గుల రామకృష్ణారావు, గద్దర్ విగ్రహాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.
డంప్‌యార్డు రద్దుకు వినతి
సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు నిర్మాణం కోసం విడుదలైన జీఓ 641ను వెంటనే రద్దు చేయాలని జేఏసీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. చైర్మన్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, సర్పంచ్ బాసునాయక్, రవికుమార్‌గుప్తా తదితరులు వినతిపత్రం అందజేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు


