నమ్మకం | - | Sakshi
Sakshi News home page

నమ్మకం

Jul 15 2026 11:59 AM | Updated on Jul 15 2026 11:59 AM

సన్నగిల్లుతున్న

వికారాబాద్‌: సన్నబియ్యం కాస్త దొడ్డుగా మారిపోయాయి.. రేషన్‌ బియ్యం పంపిణీలో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పథకం ప్రారంభమై ఏడాది తిరక్కుండానే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. మిలర్లు దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు బ్లాక్‌ మార్కెట్‌ విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లే తీసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. కిలోకు రూ.15 చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. తొలి నాలుగు నెలలు బాగానే పంపిణీ చేయగా తర్వాత నాణ్యతకు తిలోదకాలు వదిలారు. చాలా చోట్ల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా ఇంకొన్ని చోట్ల సన్నవి, దొడ్డువి కలిపి ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల ముక్కి నల్లగా మారినవి పంపిణీ చేస్తున్నారు.

మిల్లర్ల మాయాజాలం

సన్నబియ్యం పంపిణీలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధానాన్ని ఆడించి వాటిని ప్రైవేటుగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు సేకరించిన నాణ్యతలేని ధాన్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నట్లు తెలిసింది. దొడ్డు బియ్యం పంపిణీ చేసినా.. బియ్యం సరిగ్గా లేకపోయినా తిప్పి పంపే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రైస్‌ మిల్లులలోని రేషన్‌ బియ్యాన్ని ముందుగా పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తనిఖీ చేసి లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. మిల్లర్లు ఇచ్చే డబ్బులకు తలొగ్గి నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి కిరాణా, ఇతర దుకాణాల్లో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల పరిగి, కుల్కచర్ల, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, దోమ, దుద్యాల మండలాల్లో 582 క్వింటాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌కు

రేషన్‌ బియ్యం

సన్న బియ్యం పంపిణీలో వ్యత్యాసం

ఒక్కో బస్తాలో ఒక్కోరకం

తినలేక విక్రయిస్తున్న లబ్ధిదారులు

జిల్లాలో రేషన్‌ కార్డులు 2,81,175

ప్రతి నెలా పంపిణీ చేస్తున్నది 6,235 మెట్రిక్‌ టన్నులు

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం అభాసుపాలవుతోంది. రైస్‌ మిల్లర్ల మాయాజాలం.. అధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారులకు శాపంగా మారింది. దొడ్డు రకం, పురుగు పట్టిన, నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తుండటంతో ఎక్కువ మంది వండుకోవడం లేదు. పథకం ప్రారంభించిన ఏడాదిలోపే బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలో 588 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,81,175 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 6,235 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి కిలోకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.57 వరకు ఖర్చు చేస్తున్నాయి. ఈ లెక్కన ప్రతినెలా రూ.35 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. బియ్యం సరిగ్గా లేకపోవడంతో లబ్ధిదారులు రూ.15కే విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement