● అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి
● ప్రతి రైతుకూ మేలు జరగాలి: ఎమ్మెల్యే యాదయ్య
నవాబుపేట: భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే చేపడుతున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. మంగళవారం మండలంలోని ఎక్‌మామిడి గ్రామంలో భూభారతి.. భూ సర్వేపై గ్రామస్తులు, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు రీ సర్వేతో పరిష్కారం లభిస్తుందన్నారు. జిల్లాలోని 34 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో మండలంలోని ఎక్‌మామిడి, మీనపల్లికలాన్, నవాబుపేట, పులుమామిడి గ్రామాలు ఉన్నట్లు చెప్పారు. ఈ గ్రామాల్లోని భూములన్నింటినీ సర్వే చేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికీ ఒక సర్వే నంబర్ ఉంటుందని తెలిపారు. సబ్ డివిజన్ నంబర్లు ఉండవన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు చాల ఉన్నాయని.. సర్వేను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఎక్‌మామిడిలో ఇందిరా సొసైటీ కింద గతంలో రైతులు భూములు ఇచ్చారని, ఆ భూములు అటవీ శాఖ కిందకు వస్తాయని రైతులకు ఇబ్బంది లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఏడీ మధుసూదన్, తహసీల్దార్ బుచ్చయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్‌నాయక్, సర్పంచ్ నర్మద మల్లారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచులు ఎండీ రఫీ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.


