సమన్వయంతో సక్సెస్‌ చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సక్సెస్‌ చేద్దాం

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

సమన్వయంతో సక్సెస్‌ చేద్దాం

సమన్వయంతో సక్సెస్‌ చేద్దాం

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటిపొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దు

జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి

అనంతగిరి: మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ రవి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగా పని చేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పెయిడ్‌ ఆర్టికల్స్‌, సోషల్‌ మీడియా కథనాలపై నిఘా ఉంచాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీని కట్టడి చేయాలని తెలిపారు. జోనల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల సామగ్రి పొందిన తర్వాత సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మద్యం, డబ్బు రవాణా కాకుండా తనిఖీలు చేపట్టామన్నారు. జిల్లాలో 36 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు రమేష్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. బ్యాంక్‌ ఖాతా తెరచి నామినేషన్‌ వేసిన నాటి నుంచి ప్రతిరోజు ఖర్చుకు సంబంధించి ఓచర్లపై సంతకం చేసి చూపించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఆర్‌డీఓ వాసుచంద్ర, నోడల్‌, జోనల్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

అందరూ సహకరించాలి

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి కోరారు. బుధవారం వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కోడ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలను విధిగా పాటించాలన్నారు. సమావేశాలు, ర్యాలీలకు ముందుగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రార్థన స్థలాల్లో ప్రచారం చేయరాదన్నారు. ప్రతి వార్డులో బూతు స్థాయి అధికారులు ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేస్తారని చెప్పారు. పోలింగ్‌కు 48 గంటల ముందుగానే ప్రచారం ఆపేయాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement