పద్దు తప్పొద్దు హద్దు మీరొద్దు
వికారాబాద్: ఎన్నికల వ్యయాన్ని నియంత్రించడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అభ్యర్థుల ఖర్చు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థానాలకు పోటీ చేసే వారు రూ.లక్షకు మించి ఖర్చు చేయరాదు.. ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే.. గెలుపొందినా అనర్హత వేటు వేస్తారు. కానీ అభ్యర్థులు ఇవేవీ లెక్కచేయడం లేదు. పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు ధన ప్రవాహం పారుతోంది.
రోజువారీ లెక్క తప్పని సరి
అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని కట్టడి చేయడానికి ఈసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. గతంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు వారు ఖర్చు చేసిన లెక్కల వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రచారం ప్రారంభించింది మొదలు రోజువారి లెక్కలు చూపించాల్సిందే. ఇందుకు సంబంధించిన పత్రాలను జిల్లా ఎన్నికల అధికారికి ఏరోజుకారోజు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. అదే విధంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే వారి వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
అజాగ్రత్తగా ఉంటే అంతే..
ఎన్నికల ఖర్చు విషయంలో ఆయా పార్టీలు అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.. పొరపాట్లు జరిగితే గెలిచినా ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, వంద వార్డులు ఉన్నాయి. అందులో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 98 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు జనం బాట పట్టారు. నిత్యం వాహనాలకు, మందు, విందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. జనరల్ వార్డుల్లో ఖర్చు ఎక్కువగా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి వార్డులో టెంట్లు వెలిశాయి.. అక్కడే వంట తయారు చేసి వడ్డిస్తున్నారు. ప్రచారంలో మహిళలకు మంచి డిమాండ్ ఉంది. రోజుకు రూ.500, భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికల నిబంధనల అమలుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డబ్బు, మద్యం రవాణా కట్టడికి చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. అభ్యర్థుల ఖర్చుపై నిఘా ఉంచారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎవరైనా ఎక్కడైనా మద్యం నిల్వ చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ప్రతిరోజూ ఎన్నికల ఖర్చు సమర్పించాల్సిందే
రూ.లక్ష దాటితే అనర్హత వేటే
మార్గదర్శకాలు విడుదల చేసిన ఈసీ
మున్సిపాలిటీల్లో మొదలైన ప్రచార పర్వం
గల్లీకి నాలుగు షెల్టర్లు
అక్కడే తినాలి.. రాత్రి వరకు తిరగాలి


