పుర పోరు నారీ జోరు | - | Sakshi
Sakshi News home page

పుర పోరు నారీ జోరు

Feb 6 2026 11:47 AM | Updated on Feb 6 2026 11:47 AM

పుర పోరు నారీ జోరు

పుర పోరు నారీ జోరు

వికారాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో మేము సైతం అంటూ మహిళలు దూసుకెళ్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో కదం తొక్కుతున్నారు. జనరల్‌ కేటగిరీలో సైతం సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ప్రస్తుతం అన్ని వార్డు స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పుర పాలనలో భాగస్వాములు కానున్నారు. జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలు.. వంద వార్డులు ఉన్నాయి. రెండు చైర్‌పర్సన్‌ పదవులు, 44 వార్డులు మహిళలకు కేటాయించారు. పరిగి పుర పీఠం బీసీ మహిళకు, వికారాబాద్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. వికారాబాద్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూతురు గడ్డం అనన్యను అధికార కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించలేదు. పరిగిలో కాంగ్రెస్‌, బీజేపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఎవరనేది ఇంకా కొలిక్కి రాలేదు. బీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్‌ సతీమణి చంద్రకళను ప్రకటించారు. ఆమె 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్‌ను బీసీ జనరల్‌కు, కొడంగల్‌ను జనరల్‌కు కేటాయించారు. ఈ రెండు చోట్ల కూడా ఎక్కువ మంది మహిళా అభ్యర్థులే బరిలో ఉన్నారు. అవకాశం కలిసొస్తే పుర పీఠాన్ని నారీమణులే దక్కించుకునే అవకాశం లేకపోలేదు.

అత్యధికంగా మహిళలే..

నామినేషన్ల ఉప సంహరణ అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 341 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 149 మంది పురుషులు కాగా 192 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 50 శాతానికే మించి నారీమణులు పోటీ చేస్తున్నారు.

పతులకు బదులు సతులు

రిజర్వేషన్లు అనుకూలంగా రాని స్థానాల్లో ఆశావహులు తమ భార్యలను బరిలో నిలిపారు. పరిగి పుర పీఠం బీసీ మహిళకు, వికారాబాద్‌ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో చైర్‌పర్సన్‌ పదవి ఆశిస్తున్న వారు.. ఆ సామాజిక వర్గాలకు కేటాయించిన వార్డుల్లో కాకుండా వారికి బలం ఉన్న జనరల్‌ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ కారణంగా కూడా మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువైంది. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం ఊపందుకుంది. మహిళలు.. పురుషులకు దీటుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కౌంటింగ్‌ ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు.

పాలనలో వారు సైతం

పుర పాలనలో మహిళలు భాగస్వాములు కానున్నారు. పురుషుల కంటే ఎక్కువగా పాలక వర్గంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న వారి సంఖ్య చూస్తే పురుష అభ్యర్థుల కంటే వారే ఎక్కువగా ఉన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో అత్యధికంగా ఎన్నికల బరిలో నిలిచారు.

మున్సిపాలిటీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు

వికారాబాద్‌లో..

వార్డులు – 34

పురుషులు – 50

మహిళలు – 62

తాండూరులో..

వార్డులు – 36

పురుషులు – 58

మహిళలు – 77

పరిగిలో..

వార్డులు – 18

పురుషులు – 26

మహిళలు – 34

కొడంగల్‌లో..

వార్డులు – 12

పురుషులు – 15

మహిళలు – 19

సగం స్థానాల్లో మహిళా అభ్యర్థుల పోటీ

నాలుగింటిలో రెండు చైర్‌పర్సన్‌ పీఠాలు వారికే

ఎన్నికలో బరిలో 341మంది అభ్యర్థులు

మహిళలు 192, పురుషులు 149

పుర పాలనలో భాగస్వామ్యం కానున్న నారీమణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement