తీరు మారేనా! | - | Sakshi
Sakshi News home page

తీరు మారేనా!

Jun 6 2025 7:40 AM | Updated on Jun 6 2025 7:40 AM

తీరు మారేనా!

తీరు మారేనా!

అవినీతికి అడ్డాగా మారిన తాండూరు ఎస్‌ఆర్‌ఓ

తాండూరు: అక్రమ రిజిస్ట్రేషన్లకు తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అడ్డాగా మారింది. అవినీతికి కేరాఫ్‌గా మారిన ఈ ఆఫీసులో డ్యూటీ చేసేందుకు రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు జంకుతున్నారు. తాండూరుకు వచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల వ్యవధిలో ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా మరో ఇద్దరు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యారు. 2017 నుంచి నేటి వరకు తాండూరు కార్యాలయంలో 11 మందికి పైగా సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వహించారు. వీరిలో ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ అధికారులు. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ముగ్గురు అధికారులు బదిలీ చేయించుకొని ఇతర జిల్లాలకు వెళ్లారు. నాటి నుంచి ఇన్‌చార్జులే దిక్కయ్యారు. రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సురేందర్‌ నాయక్‌ 16 నెలల పాటు విధులు నిర్వహించగా, చాంద్‌ బాషా ఏడాది పాటు పని చేశారు. 2024 నుంచి 25 ఫిబ్రవరి వరకు పుర్యనాయక్‌ రెగ్యులర్‌ బాధ్యతలు నిర్వహించారు. ఈయనపై డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, మరోవైపు స్థానిక నేతల నుంచి ఒత్తిడి పెంచడంతో చేసేది లేక బదిలీ చేయించుకొని వెళ్లారు. అప్పటి నుంచి సీనియర్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఆరు నెలలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. 2020లో స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. దీంతో కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌ వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతాయి. ఆన్‌లైన్‌ లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు ఇన్‌చార్జులు అక్రమాలకు పాల్పడ్డారు. 2022 డిసెంబర్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన జమీరొద్దీన్‌ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారు. గత నెలలో అనుమతులు లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశారంటూ ఇద్దరు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్లు ఫసీయొద్దీన్‌, పవన్‌పై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే.

రియల్‌ వ్యాపారులదే పెత్తనం

తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో రియల్‌ వ్యాపారులు, పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కొంతమంది రియల్టర్లు అధికారుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

డబుల్‌ రిజిస్ట్రేషన్లు

సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగించడంతో అవినీతి అక్రమాలు జోరందుకున్నాయి. గతంలో ఒకే ప్లాట్‌కు రెండు రిజిస్ట్రేషన్లు చేశారు. మున్సిపల్‌ రోడ్డుకు కూడా రిజిస్ట్రేషన్‌ చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌ అయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొందరు రియల్టర్లు ఎమ్మెల్యేను కలిసి సమస్య పరిష్కరించాలని కోరగా వారిని వెనక్కు పంపినట్లు తెలిసింది. తాండూరు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి కోరినట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తాండూరు కార్యాలయానికి రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వస్తారని పేర్కొన్నారు. కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఆ సమయంలోనే అక్రమాలు

మూడు నెలల క్రితం తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ పుర్య బదిలీ అయ్యారు. దీంతో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 20 రోజుల పాటు విధులు నిర్వహించిన ఆయన 27 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పవన్‌ 10 రోజుల వ్యవధిలో 70 ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా సెలవులో వెళ్లిపోయారు. దీంతో మరో జూనియర్‌ అసిస్టెంట్‌ ఫసియొద్దీన్‌కు బాధ్యతలు అప్పంగించారు. రోజుకు దాదాపు 50 చొప్పున ఐదు రోజుల వ్యవధిలో 200 రిజిస్ట్రేషన్లు చేశారు. ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో విచారణకు ఆదేశించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పది రోజుల క్రితం ఫసియొద్దీన్‌ను సస్పెండ్‌ చేశారు. ఉన్నతాధికారుల ఆడిట్‌లో పవన్‌ సైతం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆయన్ను కూడా సస్పెండ్‌ చేశారు.

ఇప్పటికే ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ లేకపోవడంతో అక్రమాలు

ప్రక్షాళణ దిశగా ప్రభుత్వం

తాండూరుకు వచ్చేందుకు జంకుతున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement