మా‘మిడి’!
● ఈసారి భారీగా తగ్గిన పండ్ల దిగుబడి ● అరకొరగా కాసిన తోటలు ● ముంచిన అకాల వర్షాలు, ఈదురు గాలులు
పూడూరు: ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే 25శాతం చెట్లు మాత్రమే కాపు కాసాయి. దీనికితోడు వరుస అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో తోటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పండ్ల ధరలు భారీగా పెరిగాయి.
నోరూరిస్తున్న ఫలాలు
మార్కెట్లో విక్రయానికి పెట్టిన మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. మండల పరిధిలోని మన్నెగూడ ప్రాంతం మామిడి పండ్లకు ప్రసిద్ధి గాంచింది. పూడూరు, ఎన్కేపల్లి, మన్నెగూడ, గొంగుపల్లి,బాకాపూర్,మీర్జాపూర్ తదితర గ్రామా ల్లోని వేలాది ఎకరాల్లో ఈ తోటలు సాగవుతు న్నాయి.వీటిలో దశేరి, చిన్నరసాలు, పెద్దరసా లు, బేనిషాన్,మల్గోబా,బంగిన్‌పల్లి,తోతాపరి, లంగ్డా, సఫేదా తదితర రకాలున్నాయి. ఈ ప్రాంతంలోకాచే మామిడికి వికారాబాద్ మహమూదా అని పేరు పెట్టారు.గతంలో కాయలు కోసం కార్బైడ్ వేసి మాటు వేసే వారు. ప్రభు త్వం దీన్ని నిషేధించడంతో తక్కువ మోతాదులో ఉన్న రసాయనాలతో సహజసిద్ధమైన పండ్లను విక్రయిస్తున్నారు. ఆయా రకాలనుబట్టి కిలోకు రూ.80 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. తాజాగా, ప్రకృతిసిద్ధంగా దొరికే పండ్లు కావడంతో వినియోగదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
దారి పొడవునా దుకాణాలే..
మధుర ఫలంగా పేరున్న మామిడిని తినేందుకు అన్ని వయసుల వారు ఆసక్తి చూపుతారు. ఈక్రమంలో మన్నెగూడ సమీపంలోని హైదరాబాద్– బీజాపూర్ హైవే పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. జిల్లా ప్రజలతో పాటు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించే వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. స్థానిక తోటల్లోని దిగుబడులు మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, దుబాయ్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.
దిగుబడి లేదు
ఈసీజన్‌లో చాలా తోటలకు పూత, కాత రాలేదు. లక్షల రూపాయలు పెట్టి తోటలు కొనుగోలు చేశాం. ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ సహజసిద్ధమైన పండ్లను విక్రయిస్తున్నాం.
– రహీస్, మామిడి పండ్ల వ్యాపారి


