ప్రైవేటు వైద్యంపైపర్యవేక్షణ కరువు! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్యంపైపర్యవేక్షణ కరువు!

Dec 29 2025 10:58 AM | Updated on Dec 29 2025 10:58 AM

ప్రైవేటు వైద్యంపైపర్యవేక్షణ కరువు!

ప్రైవేటు వైద్యంపైపర్యవేక్షణ కరువు!

నగరంలో గల్లీగల్లీలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు

నగరంలో గల్లీగల్లీలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని ప్రైవేట్‌ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడుతోంది. గల్లీగల్లీలో ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు వెలుస్తున్నాయి. ఇందులో కొన్నింటికి శాఖాపరంగా ఎలాంటి అనుమతులు ఉండటం లేదని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో రిజిస్టర్‌ చేసుకున్న వైద్యులు ఉండటంలేదు. కేవలం పేర్లుమాత్రమే ఉంటున్నాయి. పెద్దపెద్ద ఆసుపత్రులు సైతం నామమాత్రపు బెడ్స్‌తో లైసెన్స్‌ తీసుకుని పెద్ద సంఖ్యలో బెడ్స్‌ ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ అక్రమ దందా వైద్యారోగ్య శాఖాధికారులకు తెలిసే జరుగుతుందని, చర్యలు తీసుకోకుండా ఉండటానికి ము డుపులు ముట్టజెబుతున్నారని సమాచారం. ఏదైనా సంఘటనా జరిగినపుడు హడావుడి చేయడం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.

● జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆసుపత్రుల అనుమతులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టడం, లోపాలను గుర్తించి, చర్యల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించడం, ఇతర పర్యవేక్షణా కార్యక్రమాలు ఆయా జిల్లాల డెమో సెక్షన్‌ చూస్తుంటుంది. ఆయా సెక్షన్లలో పనిచేస్తున్న సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం ఖచ్చితమైన సమాచారంతో తనిఖీలు చేపడితే అనధికారికంగా నిర్వహించే క్లినిక్‌లు, అందులో కొనసాగుతున్న అక్రమ బాగోతాలు బయటపడుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మెడికల్‌ కౌన్సిల్‌ సుమారు 450 కేసులు నమోదు చేసింది. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేయడం, అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహించడం, మెడికల్‌ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్స్‌, యాంటీబయోటిక్స్‌, అబార్షన్‌ కిట్లు వంటివి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు ఆసుపత్రి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నపుడు వైద్యుల సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు మాత్రం కనిపించడం లేదు. సంబంధం లేని వ్యక్తులు చికిత్సలందిస్తున్నారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై తదుపరి చర్యల కోసం ఆయా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు అప్పగించింది. తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు తనిఖీలు చేసినపుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్రమంగా మెడికల్‌ దుకాణాలను నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా, పెద్ద వ్యవస్థ ఉన్న వైద్యారోగ్య శాఖధికారులు మాత్రం తమ కంటికేమీ కనిపించడం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వార్షిక నివేదికల్లో అంతా సక్రమంగానే ఉంది. పద్దతిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారంటూ రాసుకుంటున్నారు. దీనికి ప్రతిఫలంగా ఆయా యాజమాన్యాలు అధికారులను ‘లక్ష’ణంగానే చూసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలకు మీనమేషాలు..

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా ఊహించని సంఘటన జరిగినపుడు ఇప్పటి వరకు తమకు తెలియదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నాలుగు రోజులు తనిఖీలు, ఆదేశాలు, చర్యలు అంటూ హడావుడి చేస్తున్నారు. అనంతరం పరిస్థితులు మారిపోతున్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌ కేసుల విషయంలోనూ చర్యలు తీసుకోవడానికి కొంత మంది వైద్యారోగ్యశాఖ సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారని టీజీఎంసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. వాళ్లు గుర్తించరు. మేం సమాచారం ఇచ్చినా దానిపై యాక్షన్‌ తీసుకోవడానికి సాగదీస్తారంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులకు, వాస్తవ పరిస్థితులకు సంబంధం ఉండదు

వసూళ్లకే పరిమితమవుతున్నవైద్యారోగ్య శాఖ సిబ్బంది

ఏదైనా సంఘటన జరిగితే హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement