చౌడా‘పూర్’
అక్కడ అలా.. ఇక్కడ ఇలా
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన మండలం.. అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. ఒకే సమయంలో ఏర్పడిన దుద్యాలలో అభివృద్ధి పరుగులు పెడుతుండగా.. చౌడాపూర్‌లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’నన్న చందంగా మారింది.
కుల్కచర్ల: పరిపాలన సౌలభ్యం కోసం కుల్కచర్ల మండలంలోని చౌడాపూర్ గ్రామాన్ని 24 ఏప్రిల్ 2021లో మండలంగా గుర్తించి, ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబుపేట మండలం నుంచి 7 రెవెన్యూ గ్రామాలు, కుల్కచర్ల నుంచి 7 రెవెన్యూ గ్రామాలను కలుపుకొని మొత్తం 24 పంచాయతీలతో మండలాన్ని ఏర్పాటు చేసింది.
సొంత భవనాలు కరువు
మండలం ఏర్పడి నాలుగేళ్లు అయినప్పటికీ.. ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క సొంత భవనం కూడా నిర్మించలేదు. తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసులను.. ప్రాథమిక పాఠశాలను మరోచోటికి మార్చి, ఆ గదుల్లో కొనసాగిస్తున్నారు. ఆ భవనం ఆ కార్యాలయాల కార్యకలాపాలకు అనుగుణంగా లేకపోవడంతో.. సమావేశాలను వరండాలో నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయానికి మండల పరిధి సర్పంచులు ఒకేసారి వస్తే.. కనీసం కూర్చునేందుకు సరిపడా స్థలం లేదు.
దుద్యాల్‌లో అభివృద్ధి..
చౌడాపూర్ మండలం ఏర్పడిన సమయంలోనే సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో దుద్యాల్ మండలం ఏర్పాటు అయింది. కానీ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం అలాంటివేవీ జరగడం లేదు. ఇప్పటికే దుద్యాలలో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించారు. సైనిక్ స్కూల్, సమీకృత గురుకుల పాఠశాల, మెడికల్ కళాశాల, పశువైద్యకళాశాల, ఇండోర్ స్పోర్ట్స్‌కాంప్లెక్స్, క్రికెట్ మైదానంతో పాటు వివిధ ప్రభుత్వ రంగ కార్యాలయాలు, భవనాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. చౌడాపూర్ మండలం మాత్రం నిర్లక్ష్యానికి గురైంది.
కుల్కచర్లలోనే కేజీబీవీ
చౌడాపూర్ మండలానికి మంజూరైన కేజీబీవీ పాఠశాలకు సరిపడా స్థలం, పక్కా భవనం లేకపోవడంతో కుల్కచర్లలో కొనసాగిస్తున్నారు. ఇలాంటి దుస్థితిని చూసిన మరికల్, కల్మన్‌కాల్వ, చాకల్‌పల్లితదితర గ్రామాల ప్రజలు తాము పాలమూరుజిల్లాలోనే ఉంటామని, లింగంపల్లి, అడవివెంకటాపూర్ తదితర గ్రామాల వారు కుల్కచర్ల మండలంలోకి వెళ్తామని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, మండల అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
అభివృద్ధికి నోచుకోని మండలం
నాలుగేళ్లయినా సొంతభవనాలు కరువు
పాఠశాల భవనంలో
ఎంపీడీఓ, తహసీల్ కార్యాలయాలు
సమీక్ష సమావేశాలు వరండాల్లోనే..
చౌడా‘పూర్’


