పేదరిక నిర్మూలనకు కృషి
● తెలంగాణ సమ్మిళిత జీవనోపాధిని జయప్రదం చేయాలి ● సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్
కొడంగల్: తెలంగాణ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల పాత్రపై సభ్యులకు పేదరిక నిర్మూలనపై అవగాహన కల్పించాలని, అందుకు తగినట్లు కార్చాచరణ రూపొందిస్తూ అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి(సెర్ప్ సీఈఓ) దివ్య దేవరాజన్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్, అడిషనల్ కలెక్టర్ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మండల మహిళా సమాఖ్య, వికారాబాద్ మహిళా సమాఖ్య సభ్యుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సీఆర్‌పీల సహకారంతో పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తూ సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమాన్ని వివరించారు. ఇందులో ఎంపిక చేసే అత్యంత పేదరికం కుటుంబాలకు ఆయా శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. శాఖల అధికారులకు సెర్ఫ్ ఆధ్వర్యంలో పూర్తి సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అంగడిరాయిచూర్ గ్రామంలో మహిళా శక్తి కుట్టు కేంద్రంను కలెక్టర్ ప్రతీక్‌జైన్, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, సెర్ఫ్ సీఓఓ రజిత, టీజీఐఎల్‌పీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జయరాం, రవీందర్‌రావు, సెర్ఫ్ డీపీఎం రామ్మూర్తి, శ్రీనివాస్, ఆర్‌ఎం ఉదయకుమారి తదితరులు పాల్గొన్నారు.


