చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం

May 21 2025 8:41 AM | Updated on May 21 2025 1:23 PM

-

అక్కడికక్కడే నలుగురు మృతి, 20 మందికి గాయాలు

పరిగి మండలం రంగాపూర్‌ వద్ద ఘటన

మృతుల్లో పెళ్లికొడుకు బావ, మేనబావ

పరిగి: హైదరాబాద్‌– బీజాపూర్‌ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. 

మృతుల్లో షాబాద్‌ మండలం సీతారాంపూర్‌కు చెందిన మల్లేశ్‌(35), ఇదే మండలం సోలిపేట్‌కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూక్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సందీప్‌(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

ఎలా జరిగిందంటే..
వికారాబాద్‌ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లికి చెందిన సతీష్‌కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్నవిందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రాత్రి 8:30 గంటలకు చందనవెళ్లి నుంచి పరిగికి చేరుకున్నారు. బస్సును పార్కింగ్‌ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్‌.. 

ఇదే ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1:20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెళ్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్‌ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్‌ లోడ్‌ లారీని బలంగా ఢీకొట్టింది.

తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురు
ప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్‌, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్‌, రమేశ్‌, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి.

పెళ్లి కొడుకు బావ మృతి
పెళ్లికొడుకు సతీష్‌ బావ (అక్క భర్త) మల్లేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్‌నగర్‌కు చెందిన సందీప్‌కు ఆరు నెలల క్రితమే వికారాబాద్‌ జిల్లా, పెద్దేముల్‌ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్‌ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement