
వికారాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి క్లీన్‌స్వీప్ కట్టబెట్టిన అనంతరం గెలిచిన వారిలో అమాత్యులు ఎవరా..? అనే చర్చ మొదలయ్యింది. అందరూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందటంతో పాటు ఆ పార్టీయే అధికారంలోకి రానుండటంతో మంత్రి పదవి విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొడంగల్ నుంచి గెలుపొందిన రేవంత్‌రెడ్డికే సీఎం అయ్యే అవకాశం ఉండటంతో జిల్లాకు మరో బెర్తు దక్కే అవకాశం ఉందని సమాచారం. అయితే పార్టీ ఏదైనా ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి లేదా ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెడుతూ వస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ సీట్లు బీఆర్‌ఎస్ దక్కించుకోగా రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వారిలోనూ సీనియర్లు లేకపోవటంతో వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక నేతకు మంత్రి పదవి తప్పనిసరిగా దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి అనుభవం కలిసొచ్చేనా..
జిల్లా పరిధిలోని నాలుగు సెగ్మెంట్లలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి నలుగురు కూడా ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో కొడంగల్ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కానున్నారు. దీంతో కేబినెట్‌లో ఆయన ఎలాగు ఉంటారు కాబట్టి మరొకరికి అవకాశం దక్కనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సీనియర్ నేత గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి ఇస్తామని ప్రచారంలో భాగంగా పలుమార్లు రేవంత్‌రెడ్డి ప్రకటించడం దీనికి మరింత బలం చేకూరుతోంది. ప్రసాద్‌కుమార్ 2008లో జరిగిన ఉప ఎన్నికలో మొదటిసారి ఎమ్మెలేగా గెలుపొందగా ఆ వెంటనే 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం వికారాబాద్ నుంచి మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తే కేబినేట్ బెర్తు దాదాపు ఆయనకే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మచ్చలేని నేతగా టీఆర్‌ఆర్
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్న టీ.రామ్మోహన్‌రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో కారు జోరును తట్టుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డిపై మొదటిసారి పరిగి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన పరిగి ఎమ్మెల్యేగా 23వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది సత్తా చాటారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. మచ్చలేని నాయకుడిగా పేరుతెచ్చుకోవటంతో టీఆర్‌ఆర్‌కు నియోజకవర్గ ప్రజలు రెండోసారి పట్టంగట్టారు. దీనికి తోడు ఆయనకు ఢిల్లీ వరకు పరిచయాలు ఉండటంతో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గంనుంచి కేబినెట్ బెర్తులకు పోటీ ఎక్కువగా ఉండటం... ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కితే అప్పటికే జిల్లా నుంచి కేబినెట్‌లో ఇద్దరు ఉండటం తదితర ఈక్వేషన్ల నేపథ్యంలో మంత్రి పదవి ఆయన్ను వరిస్తుందా..? లేదా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలా వారిగా చూస్తే కొడంగల్ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉండటంతో టీఆర్‌ఆర్ అనుచరుల్లో తమ ఎమ్మెల్యే మంత్రి కావటం ఖాయమని భావిస్తున్నారు. మాజీ మంత్రి, దివంగత నేత కమతం రాంరెడ్డి తర్వాత పరిగి నుంచి ఇప్పటివరకు అమాత్యయోగం ఎవరికీ దక్కలేదు. ఈ సారైనా తమ ఎమ్మెల్యే మంత్రి అయితే స్థానికంగా మరింత అభివృద్ధి జరుగుతుందని పరిగి నియోకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.
జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం
రేసులో గడ్డం ప్రసాద్‌కుమార్, టీఆర్‌ఆర్

రామ్మోహన్‌రెడ్డి, పరిగి

గడ్డం ప్రసాద్‌కుమార్, వికారాబాద్