TS Vikarabad Assembly Constituency: 'పార్టీ మారితే నన్ను ఉరి తీయండి' : బుయ్యని మనోహర్‌రెడ్డి
Sakshi News home page

'పార్టీ మారితే నన్ను ఉరి తీయండి' : బుయ్యని మనోహర్‌రెడ్డి

Published Fri, Oct 27 2023 6:48 AM

- - Sakshi

సాక్షి, వికారాబాద్‌: తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, గెలిచిన తరువాత పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని, లేకుంటే ఆంజనేయస్వామి ఆలయం ముందు ఉరి తీయాలని డీసీసీబీ చైర్మన్‌, కాంగ్రెస్‌ నేత బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అంతారం, చెంగోల్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ఆర్భాటంగా ప్రకటించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌ మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా చెంగోల్‌ గ్రామ ఎంపీటీసీ రత్నమాల, రాము యాదవ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, వీ శ్రీను, రాందాస్‌, గోపాల్‌రెడ్డి, అశోక్‌, ప్రవీణ్‌గౌడ్‌, రాంచంద్రారెడ్డి, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

టికెట్‌ ప్రకటించడం లాంఛనమే..
తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం లాంఛనమేనని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్‌వీఆర్‌ గార్డెన్‌లో పార్టీ సీనియర్‌ నాయకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్‌ జాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చంద్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శోభారణి, పెద్దేముల్‌ మండల వైస్‌ ఎంపీపీ మధులతతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న తాండూరు నుంచి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీడికే శివకుమార్‌ హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అలీం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement