నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Mar 15 2026 6:48 AM | Updated on Mar 15 2026 6:48 AM

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని కొత్త 11కేవీ లైన్‌ పనుల కారణంగా ఆదివారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనుందని ఏఈ ప్రవీణ్‌కుమార్‌ శనివారం తెలిపారు. పరిగి రోడ్‌, వడ్డర్‌గల్లి, బ్రాహ్మణవాడి, బాకారం గల్లి, కలాల్‌వాడి, ఇంద్రానగర్‌, కమర్‌కాలనీలకు సరఫరా నిలిపివేయనున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

కొడంగల్‌ రూరల్‌: తొలిదశలో రాష్ట్రంలోని 93 కేజీబీవీని వైఐఐఓఈగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయని కొడంగల్‌ కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ స్రవంతి తెలిపారు. 2026 – 27విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజీ – ఆర్జెసీ సెట్‌ 2026 ద్వారా మెరిట్‌ సాధించిన విద్యార్థినులకు వైఐఐఓఈ కళాశాలల్లో సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉంటాయని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మే నెల 3 ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఉంటుందని వివరించారు.

దౌల్తాబాద్‌ ఎస్‌ఐగా వేణుకుమార్‌

దౌల్తాబాద్‌: మండల ఎస్‌ఐగా వేణుకుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ రాజుకుమార్‌ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వికారాబాద్‌లో వీఆర్‌లో ఉన్న వేణుకుమార్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

ఉత్సవ కమిటీ చైర్మన్‌గా మహేశ్‌

తాండూరు: తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రశ్వేర దేవాలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్‌ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా మెడి మహేశ్‌, సభ్యులుగా గంగా శ్రవణ్‌కుమార్‌, గాజుల విజయ్‌కుమార్‌, లింగమంతుల శంకర్‌, శెట్టి చంద్రకాంత్‌, మాద్రికి చంద్రకాంత్‌, కోర్వార్‌ అంజలి, అగ్గనూర్‌ సాంకేత్‌లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఉగాది పండగ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దంపతులపై కేసు నమోదు

తాండూరు రూరల్‌: ఒకరి చావుకు కారణమైన దంపతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశామని కరన్‌కోట్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌ గ్రామానికి చెందిన అగ్గనూర్‌ లక్ష్మి(35)ని.. అదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారులు హన్మంత్‌రెడ్డి, ఉమాదేవి అప్పు తీర్చాలని ఒత్తిడి తేవడమే కాకుండా.. అవమాన పరిచారు. దీంతో మనస్తాపం చెందిన సదరు మహిళ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతురాలి భర్త వీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వ్యాపారులఇంటికి వెళ్లగా.. ఇరువురు పరారీలో ఉన్నారు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తోంది. కాగా.. కేసు వాపస్‌ తీసుకుంటే రూ.లక్షల్లో పరిహారం ఇస్తామని నిందితులు.. మధ్య వర్తుల ద్వారా మృతురాలి కుటుంబానికి రాయబారంపంపారు. ప్రాణం పోయిన తరువాత తమకు పరిహారం అవసరం లేదని, ఇరువురిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకునిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement