వెంకటగిరి (సైదాపురం): వెంటగిరి పోలేరమ్మ జాతర గురువారం అట్టహాసంగా ముగిసింది. 2023లో వెంకటగిరి పోలేరమ్మ జాతరను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఈ జాతరకు ప్రాధాన్యం ఏర్పడింది. వివిధ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలేరమ్మను దర్శించుకునేందుకు క్యూల్లో గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో...
పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతోపాటు అధికారుల పర్యవేక్షణలో సాగింది. సుమారు నాలుగు లక్షల మందికిపైగా భక్తులు వచ్చినట్టు సమాచారం. అమ్మవారి దర్శనం కోసం భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి నేతల సిఫార్సులకే పోలీసులు సై అనడంతో సామాన్య భక్తులకు దర్శన భ్యాగం గగనమైపోయింది. ఎటువంటి ప్రొటోకాల్ లేని కూటమి నేతలకు రాజమార్గంలో దర్శన ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిచ్చింది.
బారులు తీరిన వాహనాలు
జాతరకు వచ్చిన భక్తులకు కష్టాలు తప్పలేదు. ఎక్కడ చూసినా వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించకుండా పోయాయి.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
జాతరలో మద్యం ఏరులై పారింది. జాతర సందర్భంగా మద్యం షాపులు బుధవారం రాత్రే మూసివేయాల్సి ఉంది. కానీ అధికారులు అవేవీ పట్టించుకోలేదు. గురువారం తెల్లవారు జామువరకు మద్యం విక్రయాలు సాగాయి.
బందోబస్తు పరిశీలన
అమ్మవారి ఆలయంతో పాటు ఊరేగింపు మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీ నియంత్రణ చర్యల పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
మెట్టినింట్లో కొలువుదీరి..
జాతరలో భాగంగా బుధవారం అర్ధరాత్రి మెట్టునిల్లు అయిన జీనుగుల వారి వీధి నుంచి వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరిలో కొలువుదీర్చారు. తెల్లవారు జామున నుంచి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. గురువారం ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూల్లో బారులు దీరారు. వెంకటగిరి రాజా కుటుంబీకులు సర్వజ్ఞకుమార యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయం బద్ధంగా సారె సమర్పించారు.


