తిరుపతి అర్బన్: కొత్త పింఛన్లు అక్టోబర్ నుంచి అందిస్తారని ఓ వైపు అధికారులు.. మరోవైపు అధికార పక్షానికి చెందిన నేతలు ఊరూవాడ ఊదరగొట్టారు. అయితే అక్టోబర్‌లో పాత పింఛన్లకు మాత్రమే నిధులు మంజూరు చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 52,961 మందికి మొండిచెయ్యి చూపించారు. ‘మాకు పింఛన్ వచ్చిందా సార్’.. అంటూ పలువురు గురువారం అధికారులను అభ్యర్థించారు. కానీ కొత్త పింఛన్లకు నిధులు రాలేదంటూ అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న 52,961 మందిలో 6 వేల మందికి చెందిన దరఖాస్తులు అనర్హుల జాబితాలోని వెళ్లినట్లు చర్చ సాగుతోంది. తమ దరఖాస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వీలులేకుండా అన్ని వెబ్‌సైట్లను మూసివేశారు. దీనివెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేపు నెలకై నా కొత్త పింఛన్లు వస్తాయోరావోనని నిట్టూర్చుతున్నారు.
27 నెలల తర్వాత దరఖాస్తులకు అవకాశం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 27 నెలలకు కొత్త పింఛన్ల దరఖాస్తుకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ 27 నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా 13,500 మందికి పైగా పింఛన్లు తొలగించారు.
గతంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా అర్హులైన అందరికీ పింఛన్ ఇప్పించారు. ప్రధానంగా ఏడాదిలో రెండు సార్లు(6నెలలకు ఒకసారి) కొత్త పింఛన్లకు శ్రీకారం చుట్టారు. ఏటా జూలై 1న, అలాగే జనవరి 1న కొత్త పింఛన్లు ఇచ్చే సంప్రదాయన్ని తీసుకొచ్చారు. మంచానికే పరిమితమైన వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15వేల ిపింఛన్ అందించేవారు.
ఎగనామం పెట్టారు
నేను దివ్యాంగుడిని. రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నా. గత నెలలో దరఖాస్తు చేసుకున్నా. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎగనామం పెట్టారు. అధికారులను అడిగితే త్వరలో ఇస్తారని చెబుతున్నారు. ఏ నెల నుంచి ఇస్తారో తెలియడం లేదు. మా దరఖాస్టు స్టేటస్ తెలుసుకోవడానికి అధికారులను అడిగితే అన్ని వెబ్‌సైట్లు క్లోజ్ చేశారంటున్నారు.
–డి.శ్రీనివాసులు, దివ్యాంగుడు, పింఛన్ దరఖాస్తుదారుడు, తిరుపతి


