ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది బీసీల ఆకాంక్షపై దెబ్బ వైఎస్ జగన్ లాంటి రాజకీయ ధైర్యం చూపించే పట్టుదల కూటమికి ఉందా? కూటమి ప్రభుత్వ తీరుపై బీసీ నేతల మండిపాటు
బీసీలకు కూటమి తీరని ద్రోహం చేస్తున్నారు. వారిని ఎలక్షన్లలో ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుని ఎన్నికలయ్యాక వదిలేస్తున్నారు. మళ్లీ ఎన్నికలొస్తే ఏదో చేసేశామన్న బిల్డప్ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అమలుకు వీలుకాని కొత్త జీవోలిచ్చి జబ్బలు చరుస్తున్నారు. వాటిపై కోర్టులు మొట్టికాయ వేయడంతో ‘మేమైతే చేశాం.. కోర్టులే ఒప్పుకోలేదు’ అంటూ నెపం న్యాయస్థానాలపై నెట్టేందుకు కుటిల రాజకీయాలకు తెరలేపారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఇదే నినాదాన్ని జపించేందుకు సిద్ధమవ్వడంపై తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని బీసీలు రగిలిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ హైకోర్టు తాజా తీర్పుతో కూటమి ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ మరో సారి బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేయడంతో జిల్లా వ్యాప్తంగా బీసీ వర్గాలు, సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఈ జీవోను తీసుకొచ్చిందనే విమర్శలు చేస్తున్నారు.. తాము రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కోర్టులు తిరస్కరించాయని, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి రాజకీయ ప్రచారానికి వాడుకోవాలనేది కూటమి పెద్దల డ్రామా తప్ప ఇందులో బీసీల సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదని ఆ వర్గీయులు భగ్గుమంటున్నారు.
జగన్ విప్లవాత్మక అడుగులు
గతంలో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుల మీద, ఇతరుల మీద నెపం నెట్టి చేతులు దులుపుకోలేదు. ఆయన ఒక ధైర్యవంతమైన, విప్లవాత్మకమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన తిరుపతి కార్పొరేషన్ లాంటి పెద్ద నగరాలలో బీసీ అభ్యర్థులనే బరిలోకి దింపారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌ను కూడా బీసీలకే కట్టబెట్టారు. జీవో ప్రకారం 34 శాతమే రావాల్సి ఉంటే, తన రాజకీయ నిర్ణయంతో ఏకంగా 40 శాతానికి పైగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశాలు దక్కేలా చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
కూటమికి చిత్తశుద్ధి ఉంటే?
కూటమి ప్రభుత్వానికి నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి, తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచేలా ఒత్తిడి తీసుకురావడం, లేదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌న్‌మోహన్‌రెడ్డి చూపిన రీతిలో సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం తీసుకుని జనరల్ స్థానాల్లోనూ బీసీలకు సీట్లు కేటాయించడం చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బీసీల ఆకాంక్షపై దెబ్బ
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది బీసీలున్నారు. ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ తమకు తగిన ప్రాతినిధ్యం దక్కుతుందని ఆశగా ఎదురుచూసే ఈ వర్గాలను కూటమి ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తోంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశమంతటికీ వర్తిస్తుందని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం ఈ జీవో ఇవ్వడం బీసీలను నిలువునా వంచించడమేనని బీసీ వర్గాలు మండిపతున్నాయి.


