మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాల కోసం జనసేన పోటీ వార్డులు, డివిజన్లలోనూ పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ క్షేత్రస్థాయిలో ప్రచారాలు మొదలెట్టిన టీడీపీ, జనసేన తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేటలో పోటీకి బీజేపీ యత్నాలు తిరుపతి, చిత్తూరు మేయర్ కుర్చీలకు రూ.కోట్లలో బేరసారాలు, పైరవీలు ఎవరికి వారు సర్వేలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎవరికి వారు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం పైరవీలు, బేరసారాలు మొదలు పెట్టేశారు. కుర్చీ కోసం ఎన్ని కోట్లయినా పెట్టుకుంటామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగారు. అధికారం చేజిక్కించుకున్నాక పాలనా వ్యవహారాలు, పదవులు, పనుల పంపకాల్లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘మేము లేకపోతే మీరు గెలిచే వారు కాదు, పదవులు అనుభవించేవారు కాదు’ అంటూ మూడు పార్టీ శ్రేణులు నువ్వెంత అంటే.. నువ్వెంత అని మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ బలాన్ని నిరూ పించుకోలేకపోతే అధికారంలో ఉన్నన్ని రోజులు మా దయా దాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్నారని ఎత్తిపొడుస్తూనే ఉంటారని కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అధిష్టానం నుంచి కూడా సంకేతాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమేరకు జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీచేయకపోతే పరువు పోతుందని బీజేపీ భావిస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో బరిలో దిగాలని భావిస్తోంది. పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయోనని ఎవరికి వారు బృందాలను ఏర్పాటు చేసి సర్వేలు చేయించుకుంటున్నారు.
తిరుపతి, చిత్తూరు మేయర్ స్థానాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్ పీఠాల కోసం టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కుర్చీలు కావాలంటే భారీగా ఖర్చు అవుతుందని ముఖ్య నాయకులు చెబితే.. అందుకు సరే పెట్టుకుంటాం అంటూ స్పష్టం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తిరుపతి మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ కోసం బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తన కుమారుడి కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మరో బీజేపీ నేత కూడా మేయర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ల కుర్చీ కోసం పోటీ పడుతున్న టీడీపీ, జనసేన పార్టీలో ఐదుగురు నాయకులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు పెట్టేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా తమ పార్టీ కార్యకర్తలు కూడా వార్డుల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నగరి, పలమనేరు, కుప్పంలోనూ జనసేన నేతలు కొందరు పోటీ చేయాలని ఆశపడుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా రిజర్వేషన్లు ఖరారు అయ్యాక మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కూటమి కుమ్ములాట
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా కొట్టాం.. అధికారం తెచ్చాం.. అని సంబరపడిన కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వే అసలు రంగు బయటపడుతోంది. నగరపాలక పీఠంపై జెండా పాతేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు కత్తులు నూరుకుంటున్నారు. మా బలం లేకపోతే మీరు గెలిచేవారా? అంటూ ఒకరికొకరు ఎత్తిపొడుపులకు దిగుతున్న నేతలు, కుర్చీ కోసం కోట్లు కుమ్మరించడానికై నా వెనుకాడబోమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మార్కుల చూపించుకోకపోతే భవిష్యత్తు శూన్యమనే భావన క్యాడర్‌లో బలంగా నాటుకుకోయింది. మిత్ర పక్షాల ముసుగులో సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.


