ప్రజాధనంతో సొంత ప్రచారం! | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనంతో సొంత ప్రచారం!

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ ఎవరికోసం బాబూ? స్థానిక ఎన్నికల కోసం యువతకు గాలం వేసేందుకు కూటమి కుట్ర ఆ ప్రగల్భాలను యువత నమ్మేపరిస్థితి లేదు కూటమి కుట్రపై భగ్గుమంటున్న ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు

తిరుపతి సిటీ: ఉద్యోగం వచ్చినంత వరకు కుటుంబంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి అందజేస్తాం. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 ఇచ్చితీరుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం అని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్‌ కో ప్రగల్భాలు పలికి యువతను, మహిళలను, వెనుకబడిన తరగతులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా హామీల ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఆడబిడ్డనిధి, పింఛన్లపై యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో యువతకు గాలం వేసేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ పేరుతో కూటమి సర్కార్‌ ప్రచారం కోసం వ్యూస్‌, ఫాలోవర్స్‌ను ప్రాతిపదికగా తీసుకుని రూ.15 వేలు ఇస్తామంటూ కుట్రకు తెరలేపారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలను భాగస్వామ్యులను చేసి ప్రచారం చేసుకుని ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు పన్నాగం పన్నారు. రాజకీయ లబ్ధికోసం కూటమి కుట్రలో ఇదో భాగమని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల కుట్రలో భాగమే

తాము ఏదో చేశామని ప్రజలను సోషల్‌ మీడియా ద్వారా మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎత్తుగడే సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలకు చరమగీతం పాడేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సోషల్‌ మీడియాను వేదికగా చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు, యువతకు ఒరిగేదేమీ లేదు.

– జే.విశ్వనాథ్‌, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి

టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికే..

టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేందుకు బాబు పన్నిన కుట్ర ఇది. సోషల్‌ మీడి యా ద్వారా బాబు సర్కార్‌ తమ పార్టీ ప్రచారాన్ని చేసు కునేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. వారిని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలను స్థానిక ఎన్నికల కోసం వాడుకునేందుకు బాబు మరో ఎత్తుగడ వేస్తున్నారు.

– బి.ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతి

నిరుద్యోగభృతికి అతీగతిలేదు

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ అంటూ ప్రజాధనాన్ని తమ అనుచవర్గానికి దోచిపెట్టే ప్రయత్నం దారుణం. నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. ఆడబిడ్డ నిఽధి నెలకు రూ.1500, వెనుకబడిన వర్గాల వారికి 45 ఏళ్లకే పింఛన్లు అని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ అంటూ ప్రజాధనాన్ని ఉన్నవారికి కట్టబెట్టడం దారుణం.

– అక్బర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి

నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించండి

యువగళంలో లోకేష్‌ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చెల్లించాలి. ఏడాదికి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రామిస్‌ చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీగా మార్చారు. ఇప్పుడు ఎన్నికల కోసం యువతను మభ్యపెట్టేందుకు సరికొత్త పాలసీని తెస్తున్నారు. టీడీపీ కార్యకర్తలతో మళ్లీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది.

– శివబాలాజీ,

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement