తెరుచుకున్న రైల్వే అండర్‌పాస్‌ | - | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న రైల్వే అండర్‌పాస్‌

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

పనులు పూర్తయి మూడు నెలలు అవుతున్నా పట్టించుకోని వైనం

వైఎస్సార్‌ సీపీ ధర్నాతో దిగివచ్చిన అధికారులు

కూటమిలో అరాచకాలు, దాడులు తప్ప అభివృద్ధి శూన్యం

తిరుపతిలో నెలరోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం

వైఎస్సార్‌సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం : తిరుపతి నగర ప్రజల రాకపోకలు సులభతరం చేసేందుకు తిరుపలి కులశేఖర్‌ ఆళ్వార్‌ మార్గంలో నిర్మించిన రైల్వే అండర్‌ పాస్‌ను ప్రారంభించాలని గురువారం వైఎస్సార్‌ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ శ్రేణులు, స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో రైల్వే అండర్‌ పాస్‌ నిర్మాణ పనులు చేపట్టినట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కక్షలు, అరాచకాలు సాగిస్తున్నారన్నారు. రైల్వే అండర్‌ పాస్‌ నిర్మాణ పనులు పూర్తయి మూడు నెలలు గడిచినా ప్రారంభించకుండా అధికారులు, నాయకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. అండర్‌పాస్‌లో వర్షపునీరు నిలవకుండా మోటార్లు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో తాము 22 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం రైల్వే అండర్‌ పాస్‌ వద్ద మోటార్లు ఏర్పాటు చేయలేరా? అని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

తెరుచుకున్న రైల్వే అండర్‌ పాస్‌

వైఎస్సార్‌సీపీ ధర్నాతో కార్పొరేషన్‌ అధికారులు స్పందించి రైల్వే అండర్‌ పాస్‌ను తెరిచారు. అధికారులు రైల్వే అండర్‌ పాస్‌ను ప్రారంభించడం అభినందనీయమని చప్పట్లతో వారికి అభినందనలు తెలిపారు. మాజీ మేయర్‌ శిరీష మాట్లాడుతూ జగనన్న పాలనలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి చొరవతో తిరుపతి నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో రౌడీలకు టీడీపీ ఇన్‌చార్జ్‌ పదవులు ఇస్తే అరాచకాలు, దాడులు చేయడం తప్ప ప్రజాసమస్యలను ఎక్కడ పట్టించుకుంటారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి నగరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు నీలం బాలాజీ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కేతం జయచంద్రారెడ్డి, ఆరే అజయ్‌కుమార్‌, పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు బత్తల గీతాయాదవ్‌, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement