వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి పోలేరమ్మ జాతరకు రాష్ట్రంలోనే ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ జారతకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రెండు రోజులు ఇసుక వేస్తే రాలనంత జనం వెంకటగిరిలో ఉంటుంది. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచి పండుగ జరుపుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన వారు మొక్కులు చెల్లిస్తారు. ఈ నెల 30వ తేదీ రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు జాతర మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ మేరకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాటుచేశారు.
1917లో వెంకటగిరి సంస్థానంలో కలరా, మశూచి విజృంభించడంతో వందలాది మంది మరణించారు. అప్పటి రాజా వారు ప్రజలను కాపాడుకునేందుకు శాతల యాగం, అష్టదిగ్బంధనం యంత్రాల ప్రతిష్ట చేశారు. కలరా తగ్గకపోవడంతో పోలేరమ్మ జాతర చేశారు. ప్రజలు విపత్తు నుంచి బయట పడడంతో 1919 నుంచి జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 33 తరాల నుంచి రాజులు పోలేరమ్మ జాతరను నిర్వహిస్తున్నట్టు శాసనాలు ఉన్నాయి.
కుమ్మరి చేతిలో పుట్టిన తల్లి
కుమ్మరి రోడ్డులోని కుమ్మరులు పుట్ట మట్టితో విగ్రహం చేస్తారు. మొదట కళ్లు లేకుండా ఉంచి, జీనిగవారి వీధలో అత్తాగారింటికి పంపుతారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల తర్వాత గాలిగంగ అనే వంశీయులు కళ్లు, దిష్టి చుక్క పెడతారు. దాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.
2023లో రాష్ట్ర పండుగగా గుర్తింపు
2023లో అప్పటి వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేలా చేశారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర పండుగగా నేడు నాలుగో ఏట జాతరను నిర్వహిస్తున్నారు.
నిమజ్జనంలో మట్టే బంగారం
అమ్మవారి ఊరేగింపు మల్లమ్మ గుడివీధి వద్ద ఉన్న నిష్క్రమణ మండపం వద్దకు చేరుకోగానే అమ్మవారు కళ్లు తొలగిస్తారు. ఆ సమయంలో పోలేరమ్మ విగ్రహం మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడతారు. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో పోలేరమ్మ జాతర ముగుస్తుంది.
జాతర విశేషాలు
వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం 1వ చాటింపు, రెండో బుధవారం 2వ చాటింపు వేస్తారు.
ఆది, సోమ, మంగళవారాల్లో ఘటోత్సవం, బుధ, గురువారాల్లో జాతర ఉంటుంది.
కుమ్మరివీధిలో పుట్ట మట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్లు లేకుండా తయారు చేస్తారు.
అమ్మవారికి ముసుగు కప్పి, పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకెళ్తారు.
అర్ధరాత్రి అద్దంలో చూస్తూ వెనుక నుంచి అమ్మవారికి కళ్లు పెడతారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని నేరుగా చూడలేరని నమ్మకం. తర్వాత తెల్లవారు జాము నుంచి దర్శనం, సాయంత్రం భారీ నిమజ్జన ఊరేగింపు చేపడతారు. పోలేరమ్మ జాతరను 1992 నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తొలిపూజ మాత్రం ఇప్పటికీ వెంకటగిరి రాజా వారిదే.


