రసాయన రహిత మామిడితో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

రసాయన రహిత మామిడితో ఆదాయం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

తిరుపతి కల్చరల్‌: రైతులు రసాయన అవశేషాలు లేని, నాణ్యత కలిగిన మామిడి ఉత్పత్తులు పండించినప్పుడే మంచి గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు మామిడి ఉత్పత్తులు ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చని రాస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.వెంకటరత్నం తెలిపారు. రాస్‌, రాస్‌ కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో కోకాకోలా ఇండియా పౌండేషన్‌, న్యూడిల్లీ వారి సహకారంతో గురువారం రాస్‌ సేవా నిలయంలో మామిడిలో సుస్థిర ఆదాయ మెలకువలపై రైతులకు శిక్షణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం యాజమాన్య పద్దతులు పాటించి, జీవన ఎరువులు ,సూక్ష్మ పోషకాలు వాడాలని తెలిపారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతి మ్యాంగో ప్రాజెక్టులో భాగంగా ఇది వరకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త పీఎస్‌.సుధాకర్‌ మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలలో యూరియా 10 గ్రాములు, సూఓ్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే త్వరగా కొత్త చిగురు పెరిగి పూత తొందరగా వస్తుందని తెలిపారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టిరియా, పొటాషియం మొబిలైజింగ్‌ బాక్టీరియాల మిశ్రమాన్ని వినియోగించటం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త రాముకుమార్‌ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆహార ఉద్యాన పంటలలో ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, వ్యవసాయ డ్రోన్‌ సాంకేతికత గురించి వివరించారు. ఈ సందర్భంగా వంద మంది మామిడి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ కోసం ఎన్‌పీకే జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం, మ్యాంగో స్పెషల్‌ పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement