తిరుపతికి పోలీస్ కమిషనరేట్ ఆమోదం తెలిపిన కేబినెట్ నాలుగు జోన్లుగా విభజనకు ప్రతిపాదన కమిషనర్ నేతృత్వంలో డీసీసీలు, ఏసీపీలతో కమాండ్ వ్యవస్థ భక్తుల భద్రతకు మరింత ప్రాధాన్యం
తిరుపతి క్రైమ్ : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ మంజూరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తిరుపతి సహా రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ఇప్పటివరకు ఎస్పీ నేతృత్వంలోని జిల్లా పోలీసింగ్‌లో కీలకంగా ఉన్న తిరుపతి.. ఇక ప్రత్యేక కమిషనరేట్ పోలీసింగ్ వైపు అడుగులు వేయనుంది. వేగంగా విస్తరిస్తున్న నగరం, దేశవిదేశాల నుంచి నిత్యం తరలివచ్చే శ్రీవారి భక్తులు, పెరుగుతున్న ట్రాఫిక్, భారీ ఉత్సవాలు, వీఐపీ పర్యటనలు, సైబర్ నేరాలు, శ్రీ సిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాల భద్రతను ఒకే సమన్వయ వ్యవస్థలోకి తీసుకురావడమే పోలీస్ కమిషనరేట్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు వెల్లడిస్తున్నారు.
నాలుగు జోన్లు.. ఒకే కమాండ్
తాజాగా వెలువడిన వివరాల ప్రకారం ప్రతిపాదిత తిరుపతి కమిషనరేట్‌ను నాలుగు జోన్లుగా రూపొందించనున్నారు. తిరుమల–తిరుపతి, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి ప్రాంతాలను ఇందులో చేర్చనున్నారు. ప్రతి జోన్‌్ కు ప్రత్యేక పోలీస్ పర్యవేక్షణ ఉండేలా వ్యవస్థను రూపొందించే అవకాశముంది. అయితే జోనన్‌ల కచ్చిత సరిహద్దులు, ఒక్కో జోన్‌న్‌లోకి వచ్చే పోలీస్ స్టేషన్లు, డివిజన్ల సంఖ్యపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
అవసరం ఎందుకంటే..!
తిరుపతి పరిస్థితులు సాధారణ నగరాల కంటే భిన్నం. శ్రీవారి దర్శనం కోసం రోజూ భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, గరుడసేవ, రథోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. రైల్వే స్టేషన్‌్ , ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి, ప్రధాన మార్కెట్లు, తిరుమల మార్గాలతో పాటు రేణిగుంట ఎయిర్‌పోర్టు దిశలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, తిరుపతిలో భారీ పోలీస్ బందోబస్తు అవసరమవుతుంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల కోసం తిరుమల, తిరుపతిలో 6,071 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీసిటీకి ప్రత్యేక భద్రత
తిరుపతి కమిషనరేట్‌కు మరో ప్రత్యేకత శ్రీ సిటీ. తిరుమల–తిరుపతి ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు శ్రీ సిటీ పారిశ్రామిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా ఉంది. పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగుల రాకపోకలు, పెట్టుబడులు, రవాణా, పారిశ్రామిక భద్రత వంటి అంశాలు కూడా కొత్త కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్‌కు ప్రత్యేక సవాలుగా మారనున్నాయి. అందువల్ల ఆధ్యాత్మిక నగరం– పారిశ్రామిక ప్రాంతం రెండింటినీ కలిపిన భిన్నమైన పోలీసింగ్ నమూనా తిరుపతిలో రూపుదిద్దుకోనుంది.
పోస్టులపై ఉత్కంఠ
కమిషనరేట్ ఏర్పాటుపై కేబినెట్ ఆమోదం లభించినా డీసీపీ పోస్టులు, ఏసీపీ పోస్టులు, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరు చేస్తారన్నది ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. అలాగే ప్రస్తుత సిబ్బందిలో ఎంతమందిని పునర్విభజిస్తారు, కొత్తగా ఎన్ని పోస్టులు సృష్టిస్తారు అన్నదీ తేలాల్సి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం జారీ చేసే తుది ఉత్తర్వులు, పోలీస్ శాఖ రూపొందించే కమిషనరేట్ నిర్మాణంలో స్పష్టమవుతాయి.
ఏ ప్రాంతాలు.. ఏ విధంగా?
తాజా కేబినెట్ నిర్ణయంపై వెలువడిన వివరాల ప్రకారం తిరుమల, తిరుపతి, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి నాలుగు జోన్లుగా ప్రతిపాదించబడ్డాయి. అయితే ఒక్కో జోన్ కింద ఏయే పోలీస్ స్టేషన్లు వస్తాయి? సరిహద్దులు ఎక్కడివరకు ఉంటాయి? ఏ డివిజన్ ఏ జోనన్‌లో ఉంటుంది? అనే విషయాలు అధికారికంగా నోటిఫై కావాల్సి ఉంది. గతంలోనే ప్రతిపాదిత కమిషనరేట్ పరిధులు, మౌలిక వసతులు, అవసరమైన వనరులను అంచనా వేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు వచ్చాయి.
ఇప్పటి వ్యవస్థకు కొనసాగింపా?
కమిషనరేట్ ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ ఒక్కరోజులో పూర్తిగా మారిపోదు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం, అర్బన్‌న్ పోలీస్ యూనిట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ సెల్ తదితర మౌలిక వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కమిషనరేట్ నిర్మాణానికి అనుగుణంగా వాటిని పునర్వ్యవస్థీకరించడం, అవసరమైన కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం తర్వాత దశలో చేపట్టనున్నారు.
కొత్త మలుపు
తిరుపతి అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ 2010లో ఏర్పడింది. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్లను కలిపి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2016 జనవరి నుంచి సిబ్బంది, వనరుల కేటాయింపుతో ఇది పూర్తిస్థాయిలో పనిచేసింది. 2022లో జిల్లా పునర్వ్యవస్థీకరణతో తిరుపతి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు కమిషనరేట్ ఆమోదంతో పోలీసింగ్ వ్యవస్థ మరో కీలక దశలోకి వెళుతోంది. తిరుపతి పోలీస్ కమిషనరేట్ కేవలం అధికారుల హోదాలు మారడం మాత్రమే కాదు. తిరుమల భక్తుల రద్దీ, నగర ట్రాఫిక్, నేర నియంత్రణ, సైబర్ మోసాలు, పారిశ్రామిక భద్రత, భారీ ఉత్సవాలు, వీఐపీ పర్యటనలు వంటి విభిన్న అవసరాలను ఒకే పోలీస్ కమాండ్‌లో సమన్వయం చేయాల్సిన కొత్త బాధ్యత. కేబినెట్ ఆమోదంతో తొలి అడుగు పడింది. ఇక పరిధి.. పోస్టులు.. అధికారులు.. పోలీస్ స్టేషన్లు.. సిబ్బంది.. ప్రత్యేక విభాగాలు ఖరారైతే తిరుపతి కమిషనరేట్ పూర్తి రూపం తెలియనుంది.


