సామాన్య భక్తులకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకే ప్రాధాన్యం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

సైదాపురం/వెంకటగిరి రూరల్‌ : రాష్ట్ర పండుగ హోదాలో ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు వెంకటగిరిలో పోలేరమ్మతల్లి జాతరను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం పట్టణంలోని పింజల వీరయ్య కల్యాణ మండపంలో అధికారుల సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 27న అమ్మవారి ఘటోత్సవం నుంచి 1వ తేదీ నిష్క్రమణ వరకు ఐ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1,200 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300 చొప్పున మూడు క్యూలైన్‌లను ఏర్పాటు చేస్తున్నామని వీఐపీ దర్శనాలు ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే ఉంటాయని వివరించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నందున 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

భద్రతపై ప్రత్యేక దృష్టి

పోలేరమ్మ జాతరలో అన్నిశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది పోలేరమ్మతల్లి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఘటోత్సవం రోజు ఆదివారం విశ్వోదయ కళాశాల మైదానంలో సినీ గాయకులతో పాటకచ్చేరి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శన టికెట్లను ముందస్తుగా విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు చెంచుబాబు, గీతాకుమారి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ ఆనందమూర్తి, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ భాను ప్రకాష్‌రెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి, కమిటీ అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా రెండో చాటింపు

వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర రెండో చాటింపును సంప్రదాయబద్ధంగా బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు. తొలుత కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ , కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జాతర పనిబాపన వాళ్లు డప్పులు కొడుతూ చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం నుంచి వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మ ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా పెద్ద శివాలయం వరకు చాటింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement