శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో రెండో రోజు బుధవారం పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి విశేష అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు పాల్గొన్నారు.
ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు
తిరుపతి సిటీ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్కిల్ హబ్‌లో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు చెప్పారు. స్కిల్ హబ్‌లో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సు 360 రోజుల కాలవ్యవధితో నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ కోసం అభ్యర్థులు ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8143576866 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఉద్యోగ నియామక డ్రైవ్ రద్దు
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించాల్సిన ఉద్యోగ నియామక డ్రైవ్‌ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఉద్యోగ నియామక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు రద్దు చేసినట్లు వివరించారు. తర్వాత ఎప్పుడు నిర్వహించే వివరాలను మీడియా ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.


