శాస్త్రోక్తం.. చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తం.. చక్రస్నానం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

● పుణ్యస్నానమాచరించిన చెవిరెడ్డి దంపతులు, పెద్దసంఖ్యలో భక్తులు ● ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీకల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు

తిరుపతి రూరల్‌ : తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఉదయం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, మహా పూర్ణాహుతి చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. అనంతరం పుష్కరణి సంప్రోక్షణ, హారతి సమర్పించారు. సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలోకి తీసుకువెళ్లి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దంపతులు, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

లోక సంక్షేమం కోసం..

బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వెన్నంటి ఉండి వాహన సేవలు, వైదిక క్రతువుల్లో పాల్గొన్న చక్రతాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. లోక సంక్షేమం, భక్తుల సుఖశాంతులను కాంక్షిస్తూ ఈ పవిత్ర క్రతువును నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్‌ విహరించారు. యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి, కుంభజలంతో గర్భాలయంలో సంప్రోక్షణ చేపట్టారు. సాయంత్రం 7 నుంచి 9గంటల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి.

అందరి సహకారంతోనే..

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గ్రామస్తులు, భక్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆలయ సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా ముగిశాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement