తమ్ముళ్ల చెరలో రాణీగారి భూములు! | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల చెరలో రాణీగారి భూములు!

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

1973లో ప్రభుత్వానికి భూములు అప్పగించిన వెంకటగిరి సంస్థానం యథేచ్ఛగా ఆక్రమించుకున్న టీడీపీ నేతలు నకిలీ రికార్డులతో నిరుపేద దళితులకు టోపీ ప్రశ్నించిన బాధితులపై తప్పుడు కేసులు

పెళ్లకూరు: నిరుపేదలైన దళితులకు మంజూరు చేసిన భూములను ఎన్నో ఏళ్లుగా టీడీపీ నేతలు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. పెళ్లకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో వెంకటగిరి రాణీగారి భూములకు సంబంధించి సర్వే నంబరు 1/1నుంచి 1/5వరకు 316.15ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను వెంకటగిరి సంస్థానానికి చెందిన వెలుగోటి సామ్రాజ్యలక్ష్మి 1973 సీలింగ్‌ చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించింది. అయితే కప్పగుంటకండ్రిగ, పాలచ్చూరు ప్రాంతాలకు చెందిన పలువురు అగ్రవర్ణాలకు చెందిన వారు సదరు భూములను కబ్జా చేసేశారు. దీనిపై దళితులు హైకోర్టును ఆశ్రయించారు. 2008లో హైకోర్టు ఆదేశాలతో అప్పటి గూడూరు సబ్‌కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన 125మందికి ఒక్కొక్కరికి 0.50 ఎకరాల చొప్పున మొత్తం 63ఎకరాలు సీజేఎఫ్‌ఎస్‌ కింద పట్టాలు మంజూరు చేశారు. పాలచ్చూరు, కప్పగుంటకండ్రిగ గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు 2012లో అప్పటి తహసీల్దార్‌ సహాయంతో బోగస్‌ పాసుపుస్తకాలు సృష్టించి అడంగళ్‌లో పేర్లు నమోదు చేసుకుని బ్యాంకుల్లో భారీగా వ్యవసాయ రుణాలు పొందారు. అలాగే సర్వే సబ్‌ డివిజన్‌ 164 నుంచి 170లోని సుమారు 40 ఎకరాలను పెరుమాళ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకులు అప్పట్లో రెవెన్యూ అధికారుల సహాయంతో బోగస్‌ అడంగల్‌ సృష్టించి నేటికీ సాగుదారులుగా కొనసాగుతున్నారు.

దశాబ్దాలుగా చేసిన భూపోరాటం

ఒకప్పటి వెంకటగిరి రాణి వెలిగోడు సామ్రాజ్యలక్ష్మికి చెందిన ఇక్కడి భూములను 1973 రెవెన్యూ చట్టం ప్రకారం గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో వెంకటగిరి రాణి తమ భూములు పేదలకు దక్కాలనే లక్ష్యంతో వంద ఎకరాలను అర్హులైన పేదలకు చెందాలని వీలునామా రాసినట్లు సమాచారం. ఇక్కడి భూములను దశాబ్దాలుగా టీడీపీకి చెందిన పెత్తందారులు అనుభవిస్తుండడంతో నిరుపేద దళితులు చాలాకాలంగా భూపోరాటాలు చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో సీపీఎం నేత జక్కా వెంకయ్య ఆధ్వర్యంలో చేసిన దళితుల పోరాట ఫలితంగా ప్రభుత్వం స్పందించి పేదలకు పట్టాలు మంజూరు చేసింది. ఈ పోరాటాల్లో భాగంగానే పలువురు దళితులపై అగ్రవర్ణాల వారు తప్పుడు కేసులు బనాయించడంతో నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఫ్రీహోల్డ్‌తో సెట్టింగ్‌కు యత్నం

ఫ్రీహోల్డ్‌ ఉత్తర్వులతో ఇక్కడి భూములను టీడీపీకి చెందిన స్థానికేతరులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఆక్రమణదారులంతా టీడీపీ స్థానికేతర నాయకులు కావడం విశేషం. అలాగే మరికొందరు ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలో చేరిపోయి అక్రమణ భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీహోల్డ్‌ ఆదేశాలతో భూములను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఓప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పరోక్షంగా భూస్వాములకు సాయం చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయమై స్థానిక తహసీల్ధార్‌ హరికృష్ణను వివరణ కోరగా రాణిగారి భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement