తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 2027 పబ్లిక్ పరీక్షలకు గురువారం నుంచి ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 29లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని కళాశాల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో నవంబర్ 11వరకు గడువు ఉంటుందని వివరించారు.
ఆలయంలో చోరీ
నారాయణవనం: మండలంలోని అరణ్యంకండ్రిగలో ఉన్న గణపతి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఈ విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. దుండగులు హుండీని పగులగొట్టి కానుకలను అపహరించినట్లు వెల్లడించారు. వినాయకచవితి నేపథ్యంలో హుండీలోనే సుమారు రూ.15వేల నగదు ఉంటుందని వివరించారు. అలాగే ఆలయంలో రూ.35వేల ఆంప్లిఫయర్‌ను సైతం చోరీ చేశారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
చంద్రగిరి : మండలంలోని పనపాకం పంచాయతీ జక్కలవారిపల్లె వద్ద రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పనపాకం పాతపేటకు చెందిన జి. ప్రసాద్(35) వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వేపోలీసులు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు వెల్లడించారు. చిత్తూరు రైల్వే ఎస్‌ఐ వెంకట నరసింహా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్ కూల్చివేత
పెళ్లకూరు : మండలంలోని చిల్లకూరులో జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను బుధవారం సంబంధిత శాఖ అధికారులు కూల్చివేశారు. 40వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్‌హెడ్ ఓటర్‌ట్యాంక్‌ను 1998లో రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే జాతీయ రహదారి రోడ్డు విస్తరణ కారణంగా వాటర్ ట్యాంక్‌ను కూల్చివేశారు.
ఎస్వీయూ క్రీడా బడ్జెట్ రూ.70.89 లక్షలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ క్రీడా బడ్జెట్ కింద రూ.70.89లక్షలు కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బుధవారం ఈ మేరకు ఎస్వీయూ వీసీ నర్సింగరావు అధ్యక్షతన క్రీడామండలి సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఎస్వీయూ అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్, చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించే బాధ్యతను పలమనేరు ఎస్వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అప్పగించారు. అలాగే పురుషుల హాకీ, ఫుట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణను ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అన్ని క్రీడలను, అథ్లెటిక్స్‌ను ఎస్వీయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. శారీరక విద్యా విభాగం మాజీ డైరెక్టర్ దివంగత ఎంఎస్ శివశంకరయ్య కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఆయన జ్ఞాపకార్థం టెన్నిస్ మహిళల సింగిల్స్ షీల్డ్, పురుషుల క్రికెట్ జట్టు షీల్డ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
స్విమ్స్‌లో క్లిష్టమైన శస్త్రచికిత్సలు
తిరుపతి తుడా : స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగం క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిందని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ఉడుమలకుర్తికి చెందిన 67 ఏళ్ల నాగిరెడ్డి సిద్ధారెడ్డి మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, ఇతర సమస్యలతో స్విమ్స్‌కు వచ్చారన్నారు. వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగ్‌ల అనంతరం రోగి పరిస్థితిని న్యూరోసర్జరీ వైద్యులు సమగ్రంగా పరిశీలించి ప్రాణదానం పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని వెల్లడించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాళెం గ్రామానికి చెందిన 23 ఏళ్ల బొక్క నాగ సతీష్‌కు స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగంలో అత్యాధునిక న్యూరోమోడ్యులేషన్ చికిత్స అందించారని వివరించారు. ఈ మేరకు వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.


