పెళ్లకూరు: మండలంలోని తాళ్వాయిపాడు వద్ద సర్వే నంబర్ 68/1లోని 55.15 ఎకరాల విలువైన మేత పోరంబోకు భూములను పట్టా భూములుగా మార్చేసి కొందరు స్వాహా చేసినట్లు ఇటీవలే బట్టబయలైంది. గ్రామానికి చెందిన 9మందికి ఈ భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేసిన విషయం సూళ్లూరుపేట ఆర్‌డీఓ దేవందర్‌రెడ్డి పరిశీలనలో వెల్లడైంది. ఈ భూములు ఇప్పటికే పలువురి చేతులు మారడం విశేషం. నాయుడుపేట పట్టణానికి అత్యంత సమీపంలోని భూముల ధర ఇటీవల హైవే నిర్మాణంతో ఎకరా రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు పెరిగిపోయింది. రెండు పర్యాయాలు రీసర్వేలు చేపట్టిన స్థానిక రెవెన్యూ అధికారులు వీటిని ప్రభుత్వ మేత భూములను గుర్తించకుండా పట్టా భూములుగా కొనసాగించడం గమనార్హం. జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడి నిర్వాసితులకు పట్టాభూముల మాదిరిగానే పరిహారం చెల్లించడం విశేషం. ల్యాండ్ కన్వర్షన్ విషయమై కొందరు తిరుపతి, నెల్లూరు కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించడంతో అసలు విషయం బయటపడినట్లు ఆర్‌డీఓ వెల్లడించారు. తాళ్వాయిపాడు గ్రామం సర్వే నంబరు 68/1లో ఉన్న 55.15ఎకరాల ప్రభుత్వ మేత భూమిపై కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు వివరించారు.


