చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను జరిపించనున్నారు. అందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం చేపట్టారు. గురువారం పవిత్రప్రతిష్ఠ, 25న పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి నిర్వహించనున్నారు. భక్తులు రూ.750 చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలను బహుమానంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్ర నాథ్ పాల్గొన్నారు.


