ఇంజినీరింగ్‌ తుస్‌! | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ తుస్‌!

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

అయోమయంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు కన్వీనర్‌ కోటా సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీకాని వైనం ముగిసిన తుది విడత ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జిల్లాలో వేల సంఖ్యలో మిగిలిపోయిన సీట్లు తలలు పట్టుకుంటున్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యం

జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్య తుస్‌ మంటోంది. ఒకప్పుడు ఇంజినీరింగ్‌ సీట్లకు ఉన్న

డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఇప్పుడు కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు

రావడం.. దానికి తగట్టుగా ఉపాధి

అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు

ఇంజినీరింగ్‌ విద్యకు ముఖం చాటేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఈఏపీసెట్‌ మూడు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసినా

కన్వీనర్‌ సీట్లు కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. ఇక స్పాట్‌ అడ్మిషన్లపైనే ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలల భవితవ్యం

ఆధారపడి ఉన్నందని నిపుణులు

విశ్లేషించుకుంటున్నారు.

తిరుపతి సిటీ: జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకురావడం, కోర్సు పూర్తి చేసినా ఉపాధి దొరకకపోవడంతో సాధారణ డిగ్రీ కోర్సుల కంటే ఇంజినీరింగ్‌ కోర్సుల పరిస్థితి గందరగోళంగా మారింది. 2026–27 విద్యాసంవత్సరంలో కన్వీనర్‌ కోటా కింద జిల్లాలో 70శాతం సీట్లు భర్తీ కావాల్సి ఉండగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసేనాటికి 55 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుసుస్తోంది. ఇక యాజమాన్య కోటా సీట్ల భర్తీ చెప్పాల్సిన పనిలేదు.

మూడు విడతలు కౌన్సెలింగ్‌ చేపట్టినా...

2026–27 విద్యాసంవత్సరంలో ఏపీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మూడు విడతలుగా కొనసాగింది. గతంలో రెండు విడతలకే కన్వీనర్‌ కోటా సీట్లు కేటాయింపు ముగిసేది. కానీ ఈ ఏడాది అడ్మిషన్లు అంతంతమాత్రంగా ఉండడంతో సాంకేతిక విద్యాశాఖ మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సైతం చేపట్టింది. కానీ ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ప్రధానంగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సైతం పలు బీటెక్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద సీట్లు మిగిలిపోవడం ఆశ్చర్యకరం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 24 వేలకు పైగా సీట్లు ఉండగా ఇందులో కన్వీనర్‌ కోటా సీట్లు 15 వేల వరకు ఉన్నట్లు సమాచారం. కాగా ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూరైనా ఇప్పటీకి కన్వీనర్‌ కోటా కింద జిల్లాలో సుమారు 2 వేల సీట్లు మిగిలిపోవడం గమనార్హం.

‘ప్రైవేటు’ దయనీయం

గతంలో డీమ్డ్‌, ప్రభుత్వ, అటానమస్‌ కళాశాలల్లో 90 శాతం వరకు సీట్లు భర్తీకాగా ఈ ఏడాది కనీసం 79 శాతానికి మించలేదు. అలాగే ప్రైవేటు కళాశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పేరొందిన కళాశాలల్లో 60శాతం సీట్లు మాత్రమే భర్తీకాగా మిగిలిని కళాశాలల్లో అడ్మిషన్లు 50 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం భర్తీ అయిన సీట్లు కేవలం సీఎస్‌ఈ బ్రాంచ్‌కు సంబంధించి ఏఐ, ఎమ్‌ఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, సీఎస్‌ఈ కోర్‌ తోపాటు ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌లలో మాత్రం 95 శాతం సీట్లు భర్తీ కాగా మిగిలిన బ్రాంచ్‌లలో 40 శాతం సైతం సీట్లు భర్తీ కాకపోవడం విశేషం.

ఉపాధి లేకపోవడమే కారణమా?

ఆశలన్నీ ‘స్పాట్‌’పైనే

ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టినప్పటికీ తిరుపతి జిల్లా నుంచి 438 మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదివారం విడుదలైన మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం 295 మందికి మాత్రమే సీట్లు లభించినట్లు సమాచారం. కన్వీనర్‌ కోటా సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీకాని నేపథ్యంలో వచ్చేవారం నుంచి స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియకు అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్‌ అడ్మిషన్లలోనైనా 80శాతం సీట్లు భర్తీ అవుతాయా..? అనే మీమాంసలో ప్రైవేటు యాజమాన్యాలు తలలుపట్టుకుంటున్నాయి.

జిల్లాలో ప్రతి ఏటా వేలాది మంది బీటెక్‌ కోర్సులు పూర్తి చేసుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వందల సంఖ్యలో మాత్రమే విద్యార్థులకు పలు పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యం లేకపోవడమే. అలాగే వేలాది మంది కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు తగ్గట్టు పారిశ్రామిక రంగం ఆ స్థాయిలో అభివృద్ధి కాకపోవడం రెండవ కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్స్‌ ఆశించిన స్థాయిలో ప్రస్తుత ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొరవడిందని, నిపుణులైన అధ్యాపకులు సైతం పలు కళాశాలల్లో లేకపోవడం మరో కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement