రూ.1.10 కోట్లతో నిర్మించిన తారు రోడ్డుని తవ్వేస్తున్న వైనం రోడ్డు కింద మట్టి తొలగించి పొలంలోకి మళ్లింపు విద్యుత్ స్తంభాలకూ ముప్పు అధికారుల జోక్యం కోసం గ్రామస్తుల ఎదురుచూపు
భాకరాపేట: గత ప్రభుత్వ హయాంలో కొత్తపల్లి నుంచి మద్దిరెడ్డిగారిపల్లి వరకు కమళ్ల సచివాలయం మీదుగా సుమారు రూ.1.1 కోట్లతో తారు రోడ్డు నిర్మించారు. అయితే అదే పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన భూమిని విస్తరించుకునేందుకు రహదారి కింద భాగంలోని మట్టిని తవ్వి పొలంలోకి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై ఉన్న తారు పొరను అలాగే ఉంచి కింద మట్టిని తొలగించడంతో రహదారి అంచులు బలహీనంగా మారాయి. వాహనాలు వెళ్లే సమయంలో రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ మట్టిని తవ్వేయడంతో వాటి పునాదులు బలహీనపడి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి.
45 ఎకరాలపై ఆరోపణలు
ఎస్టీ కాలనీ భూముల విషయంలోనూ సదరు వ్యక్తిపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాలనీ వాసులను ఖాళీ చేయించి, వారు నివసించిన భూములను తమ ఆధీనంలోకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వాల హయాంలో రాజకీయ అండదండలు పొందుతూ సుమారు 45 ఎకరాల మేర డీకేటీ పట్టాలను సృష్టించి భూములను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భూ వ్యవహారంపై హైకోర్టు లోకాయుక్తలో కేసులు నడుస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
ప్రజాధనం వృథా కాకుండా చూడాలి
ప్రజాధనంతో నిర్మించిన రహదారిని వ్యక్తిగత భూమి కోసం ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు విద్యుత్ స్తంభాలకు ఏర్పడిన ముప్పును తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల రాకపోకల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారికే ఆక్రమణల బెడద మొదలైంది. రోడ్డును యంత్రాలతో తవ్వి.. కింద మట్టిని తొలగించి పక్కనే ఉన్న పొలంలోకి కలిపేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎర్రవారిపాళెం మండలం, కమళ్ల పంచాయతీ పరిధిలోని మద్దిరెడ్డిగారిపల్లి ఎస్టీ కాలనీ వద్ద ఈ వ్యవహారం వెలుగుచూసింది.


