తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీ ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనట్లు తెలిపాశారు. ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, డీ, బీ, ఎమ్ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 04 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
బాధ్యతల స్వీకరణ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కుప్పాల సత్యనారాయణ ఉద్యోగోన్నతిపై గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ రైల్వేలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
కాణిపాక వినాయకునికి ముక్కంటి సారె
శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామివారికి ముక్కంటి ఆలయ సారెను గురువారం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే.వెంకటేశులు అందజేశారు. వారికి ఆలయం వద్ద ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదమంత్రో చ్ఛారణల నడుమ వారు ఆలయానికి పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, విజయమ్మ, హైమావతి, పగడాల మురళి, అధికారులు శ్రీనివాసరాజు, మోహన్ పాల్గొన్నారు.
జనవరి 22 నుంచి
జేఈఈ మెయిన్స్
తిరుపతి సిటీ: ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే కలను విద్యార్థులు నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జేఈఈ మెయిన్స్–2027 పరీక్షల తేదీలను ఎన్‌టీఏ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాలలో రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనన్నట్లు ప్రకటించారు. అలాగే రెండవ సెషన్ పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవతున్నట్లు వెల్లడించారు. తొలి సెషన్ పరీక్షల కోసం అక్టోబర్ మొదటి వారంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
పింఛన్ల దరఖాస్తుకు
నేటితో ఆఖరు
తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ల దరఖాస్తుకు శుక్రవారంతో గడువు పూర్తికానుంది. ఇప్పటివరకు 49,205 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇంకా 11 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.


