● తొలగింపులు ఉండవు.. అందరినీ కొనసాగిస్తాం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 134 మంది బిల్ కలెక్టర్లకు భారీ ఊరట లభించింది. ఉద్యోగం నుంచి ఎవ్వరినీ తొలగించబోమని, అందరినీ కొనసాగిస్తామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ హామీ ఇచ్చారు. బిల్ కలెక్టర్లను కొనసాగించడంతో పాటు ప్రత్యామ్నాయ విధులపై నవంబర్1వ తేదీన జరిగే చర్చలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట 31 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను బిల్ కలెక్టర్లు విరమించారు. చర్చల అనంతరం సంస్థ డైరెక్టర్ గురవయ్య, సీజీఎంలు మురళి, రామచంద్రయ్య, ప్రసాద్ తదితర అధికారులు దీక్షా శిబిరానికి చేరుకుని యాజమాన్యం నిర్ణయాన్ని వివరించారు. అనంతరం డైరెక్టర్ గురవయ్య నిమ్మరసం ఇచ్చి బిల్ కలెక్టర్ల దీక్షలను విరమింపజేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, ఏపీ బిల్ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


