తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై వెంకన్న విహరించారు. రాత్రి హంస వాహనంపై సరస్వతీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు దేవదేవేరులనను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం కనులపండువగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నశేష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలానికి చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. హంస వాహన సేవకు పాకాల మండలానికి చెందిన వారు సారె సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుటుంబీకులు పర్యవేక్షించారు. – తిరుపతి రూరల్
లారీని ఢీకొన్న తమిళనాడు ఆర్టీసీ బస్సు
ఆదేశాల అమలు తప్పనిసరి
నాయుడుపేట టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను మున్సిపల్‌శాఖ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి కమిషనర్లు షేక్ ఫజులుల్లా, చిన్నయ్య, కిరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్‌కు మధ్యాహ్న భోజనం పంపిణీని పరిశీలించారు. మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ పాల్గొన్నారు.
పాఠశాల ఆవరణలోకి పాము
పుల్లంపేట :ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి పాము రావడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం సాతువారిపల్లె ప్రాథమిక పాఠశాల గేటు తీయగానే రక్తపింజరి పాము కనిపించడంతో విద్యార్ధులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని పాముని కొట్టి చంపేశారు. పాఠశాల సమీపంలో ముళ్లపొదలు అధికంగా ఉండడం, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషజీవుల సంచారం అధికమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉండడంతో చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు. శిథిలావస్థలోని పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నాయుడుపేట టౌన్ : మండలంలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీని తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన 103 బస్సు నెల్లూరు నుంచి 50 మంది ప్రయాణికులతో చైన్నెకు బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో కాల్ రావడంతో డ్రైవర్ ఫోన్ చూస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చుని ఉన్న కండక్టర్ షణ్ముగంతోపాటు ఇందుకూరు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుమలశెట్టి మల్లికార్జున, పొదలకూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, సూళ్లూరుపేటకు చెందిన ఎస్‌కే షేక్ సద్దార్, తడ మండలం చెరివి గ్రామానికి చెందిన శ్రీరాఘవేంద్ర, నాయుడుపేటకు చెందిన ఎన్.నరేంద్రకుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువత, హైవే మొబైల్, 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.తీవ్రంగా గాయపడిన కండక్టర్ షణ్ముగాన్ని మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకెళ్లార. ప్రయాణికులు మరో బస్సులో చైన్నెకు తరలివెళ్లారు. సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్‌ఐ రామ్మూర్తి, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కండక్టర్ వద్ద ఉన్న రూ.15వేల నగదు 108 ఈఎంటీ బల్లి కిరణ్‌కుమార్, పైలెట్ సుబ్బారావుకు దొరికింది. వారు ఆ నగదును ప్రభుత్వ వైద్యశాలలో బస్ డ్రైవర్ జ్ఞానప్రకాష్‌కు అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్‌బీఐ మేనేజర్ దుర్మరణం
వెంకటగిరి రూరల్:వెంకటగిరి– తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొని ఎస్‌బీఐ వెంకటగిరి శాఖ మేనేజర్ మృతి చెందారు. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దీపక్ (35) వెంకటగిరి స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీపక్ వాకింగ్ వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. స్ధానికులు 108లో వైద్యశాలకు తరలించగా దీపక్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
లారీ ఢీకొని అర్చకుడి మృతి
శ్రీకాళహస్తి: ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న అర్చకుడు కళ్యాణ్ కుమార్ శర్మ (29) అక్కడకక్కడే మృతి చెందాడు. వివరాలు.. పల్లం గ్రామానికి చెందిన పులివెందుల కళ్యాణ్ కుమార్ శర్మ వెంకటగిరి వెళ్లి తిరిగి వస్తుండగా పల్లంపేట పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


