తిరుపతి అర్బన్: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త పింఛన్ల కోసం వేలాది మంది సచివాలయంతోపాటు మండల, డివిజన్ కార్యాలయాల్లోనే కాకుండా ఏకంగా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసి అర్జీలు సమర్పిస్తున్నారు. అందులో ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులను కలిసి తమ బాధలు ఏకరువు పెట్టారు. మాకు న్యాయం చేయండి అంటూ రెండు చేతులు జోడించి అధికారులను వేడుకున్నారు.
ప్రతి గ్రీవెన్స్‌లో అర్జీలు
సత్యవేడు మండలం, ఆరంబాకానికి చెందిన రాజాకు రెండు కాళ్లులేవు. దివ్యాంగుడైన అతను రెండేళ్లుగా తన భార్య పుష్పతో కలసి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు విచ్చేస్తున్నారు. సత్యవేడు నుంచి తిరుపతి రావడానికి 80 కి.మీ ప్రయాణించి అర్జీలు సమర్పిస్తున్నారు. వారు సోమవారం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆపై కలెక్టరేట్‌లో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.
తిరుపతిలో రేషన్ రచ్చ
తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో రేషన్ బియ్యం రచ్చ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. స్థానికేతరులు డీలర్ల వద్దకెళ్లడం.. వారు ఇవ్వకపోవడం షరామామూలుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల కుటుంబాలు తిరుపతిలో నివాసముంటున్నాయి. వారిలో చాలా మంది వైట్ రేషన్ కార్డు కలిగిన వారే ఉన్నారు. వీరందరికీ రేషన్ బియ్యం ఇవ్వాల్సిన డీలర్లు సివిల్ సప్లయ్ అధికారులు ఇవ్వలేదంటూ చేతులెత్తేస్తున్నారు. అధికారులనడిగితే డీలర్లు ఎవ్వరూ తమను అడగలేదని అంటున్నారు. ఇటు డీలర్లు, అటు అధికారుల మధ్య కార్డుదారులు బలైపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.


