అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

తిరుపతి సిటీ: గ్రంథాలయాలు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందాయని ఎస్వీ వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూలో బ్రిడ్జింగ్‌ ది డిజిటల్‌ డివైడ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ అండ్‌ అకడమిక్‌ లైబ్రరీస్‌ అనే అంశంపై జరుగతున్న జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు గతానికి ఇప్పటికీ డిజిటల్‌, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ఆర్‌కె భట్‌ మాట్లాడుతూ పౌర గ్రంథాలయ యాక్ట్‌లు చాలా ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా పనిచేయడంలేదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గురవారెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలో పౌర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలలో చదివే అలవాటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మధుసూదన్‌, సెమినార్‌ డైరెక్టర్‌ ఆచార్య శ్రీనివాస రాఘవన్‌, సెమినార్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆచార్య కే.సురేంద్రబాబు, గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి ప్రశాంతికుమారి, దేశంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి గ్రంథాలయాధికారులు, మేథావులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,440 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

జాప్యం చేయొద్దు

తిరుపతి అర్బన్‌: జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జేసీ గోవిందరావుతో కలసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూసేకరణలో సమస్యలు ఉన్నా.. అలాగే పరిహారం విషయంలో ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు ప్రాంతాల్లో భూసేకరణ పనుల్లో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువులోపు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.

వేడుకగా గంధోత్సవం

తిరుపతి కల్చరల్‌: కులమతాలకు అతీతంగా ముస్లింలు గురువుల పట్ల అత్యంత భక్తితో గంధోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, సేవ జీవిత సార్థకతకు మార్గదర్శకమని ఖాదరీ పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌షఫీ అహ్మద్‌ఖాదిరి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగానున్న దర్గాలో హజ్రత్‌ ఫీర్‌ సయ్యద్‌ అమానుల్లాషా ఖాదరి 80వ గంధోత్సవాన్ని మంగళవారం రాత్రి అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టారు. ఉర్దూ గాయకుల బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్‌ నజీర్‌ఖాన్‌, డాక్టర్‌ మొహద్దీన్‌బాషా, డాక్టర్‌ అమీనుల్లా, ముస్తఫా, కలాం, నవీన్‌, చాంద్‌బాషా, ఖాదర్‌బాషా, హిమబిందు, దినేష్‌ సింగ్‌, నవీన్‌ సింగ్‌, ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement