కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16 వరకే గడువు
తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ దరఖాస్తుల గడువు సమీపిస్తుండడంతో అర్హులైన వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సచివాలయాల్లో ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే గడువు విదించింది. కేవలం పది రోజులు సమయం ఉండడం.. అందులో మూడు రోజులు సెలవులు మినహాయిస్తే ఏడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయింది. ఇక ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉంది. జిల్లాలో 30 వేల నుంచి 35 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మరో వైపు దరఖాస్తు సమయంలో ఆధార్–మొబైల్‌కు అనుసంధానం చేసి ఉండాలి.. లేదంటే ఓటీపీ చెప్పకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంది.
తొలి రోజు నుంచే సర్వర్ సమస్యలు
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి తొలి రోజు నుంచే సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సర్వర్ సమస్యలు చోటుచేసుకోవడంతో 2,669 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు వివిధ సమస్యల కారణంగా 735 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సెలవు రోజులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేనా?
పలువురు సచివాలయ ఉద్యోగులు బీఎల్వోలుగా పనిచేస్తున్న క్రమంలో వారు ఇంటింటా సర్వే, పోలింగ్ బూత్‌ల పరిశీలన, ఇతర సర్వేల పేరుతో సచివాలయంలో అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులను ఈ నెల 16వ తేదీ వరకు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


