తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తలకు సజావుగా దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ అదనపు ఈవో, సీవీఎస్‌వో మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలు పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు ముఖ్యమంత్రి తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. వాహన రద్దీ నియంత్రణకు తిరుపతి అలిపిరి చెక్‌పాయింట్, జూ పార్క్ సమీపంలోని టీటీడీ స్థలాలు, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. గరుడ సేవకు తిరుమల, తిరుపతిలో తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న గరుడ సేవ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


