పీజీఆర్‌ఎస్‌కు క్యూ కట్టిన అర్జీదారులు
తిరుపతి అర్బన్: గత ఏడాది జూలై, ఆగస్ట్ నెలల్లో 40 మందికి పైగా రైతులు పండించిన వరిధాన్యాన్ని తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించామని, వారం రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తామని చెప్పిన ఆ వ్యాపారి ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వ్యాపారి సమాధానం చెప్పకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో జేసీకి న్యా యం చేయాలని వినతిపత్రాన్ని ఇచ్చామని రైతులు వివరించారు. సుమారుగా రూ.2.2 కోట్లు రైతులకు వ్యాపారి ఇవ్వాల్సి ఉందని వాపోయారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ప్రధానంగా పూడి, యార్లపూడి, సుబ్బానాయుడుకండ్రిగ, వెంకటాపురం, చిట్టత్తూరు, అంజిమేడు, పుల్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు కన్నీరుపెట్టుకున్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 275 అర్జీలు
కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 అర్జీలు రాగా.. అందులో రెవెన్యూ సమస్యలపైనే 152 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ప్రతి అర్జీకి న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అర్జీలు స్వీకరించారు.
పనిభారం తగ్గించండి
పనిభారం తగ్గించాలంటూ ఆశావర్కర్లు కలెక్టరేట్‌లో అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ విధులకు సంబంధం లేని పనులు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో డ్యూటీలను వేయరాదన్నారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఆశా వర్కర్ల యూనియన్ నేతలు హైమావతి, చాముండేశ్వరి, ధనలక్ష్మి, మారెమ్మ పాల్గొన్నారు.
ఇంటిపట్టాలకు భద్రత కల్పించాలంటూ ధర్నా చేస్తున్న గ్రామీణ వాసులు
రక్షణ కల్పించండి
దశాబద్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టాలకు సరైన రికార్డులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని, వాటికి రక్షణ కల్పించాలని వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్‌పురం, అంబేద్కర్‌కాలనీ, చెంచులక్ష్మి కాలనీకి చెందిన వారు ఆవేదన చెందారు. ఆ మేరకు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. 180 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ రికార్డులో నమోదు చేయలేదని వాపోయారు.
జరిమానాలు సరికాదు
పదేపదే వాహనాల తనిఖీలు చేపట్టడం, చిన్న పొరబాట్లకు భారీ మొత్తంలో జరిమానాలు విధించడం సరికాదని ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ మాట్లాడుతూ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, మినీ వ్యాన్లు, అంబులెన్సులకు భారీ ఈ–చలానాలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు.


