తిరుపతి రోడ్లు, ఫుట్‌ పాత్‌లు భారీగా ఆక్రమణ దుకాణాలు పెట్టుకున్నందుకు ప్రతిఫలంగా కప్పం కట్టాల్సిందే | - | Sakshi
Sakshi News home page

తిరుపతి రోడ్లు, ఫుట్‌ పాత్‌లు భారీగా ఆక్రమణ దుకాణాలు పెట్టుకున్నందుకు ప్రతిఫలంగా కప్పం కట్టాల్సిందే

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

● పోటీపడి అమ్మేస్తున్న టీటీడీ, జనసేన నేతలు ● రోజుకు ఒక షాపునకు రూ.200 నుంచి రూ.2వేల వరకు వసూళ్లు ● చోద్యం చూస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

● పోటీపడి అమ్మేస్తున్న టీటీడీ, జనసేన నేతలు ● రోజుకు ఒక షాపునకు రూ.200 నుంచి రూ.2వేల వరకు వసూళ్లు ● చోద్యం చూస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు, వ్యాపారులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది పేదలే ఉండడంతో రోడ్ల పక్కన టిఫిన్లు, కూల్‌ డ్రింక్‌లు, టీలు తాగుతుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని అనేక దుకాణాలు రోడ్లపక్కన నెలకొల్పుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకునేందుకు జనసేన, టీడీపీలోని కొందరు నేతలకు కప్పం చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక్కో షాపునకు రోజుకు రూ.200 నుంచి రూ.2 వేల వరకు చెల్లించాల్సిందే. కప్పం ఇవ్వని వారి షాపులు మరునాడే కూటమి నేతలు తొలగించేస్తున్నారు. ఇరు పార్టీల వారికి ఇదే ప్రధాన ఆదాయ వనరు కావడంతో పోటీలు పడి పర్మిషన్లు ఇస్తున్నారు. ఎక్కడ బడితే అక్కడ షాపులు ఏర్పాటు చేయిస్తున్నారు. నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించేస్తున్నారు. పాదచారులు, వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన కార్పొరేషన్‌ అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది.

కప్పం కడతావా.. దాడి చేయమంటావా?

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దానికి పైగా చిరు వ్యాపారాలు సాగిస్తూ కొందరు పొట్టపోసుకుంటున్నారు. ఇదే అదునుగా పేదల ముసుగులో కూటమి నేతలు అక్రమ దుకాణాలకు తెరలేపారు. రెండేళ్లలో నగరంలో దాదాపు 500 పైగా ఆక్రమిత ప్రాంతంలో వివిధ దుకాణాలు వెలిశాయి. నిజమైన పేదలు ఎవరైనా దుకాణం పెట్టుకుంటే వారిని కార్పొరేషన్‌ అధికారులు కాకుండా కూటమినేతలే అడ్డుకుంటారు. కప్పం కట్టందే ఎవరైనా దుకాణం పెడితే రౌడీ మూకలు గద్దల్లా వాలిపోతున్నారు. వారిపై దండయాత్ర చేసి రోజుకు తమకు ఇంత కడితేనే పెట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన నేతల్లో కొంతమంది పోటీపడి అక్రమాలను పెంచి పోషిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నెలకు ఒక్కో నేత రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. మరికొందరి వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా..

ఫుట్‌పాత్‌లు పాదాచారుల కోసమే ఉపయోగించాలని ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్చకాలను విడుదల చేసింది. బెంగళూరులో ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురవ్వడంతో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కోర్టు మెట్లు ఎక్కారు. ఫుట్‌పాత్‌ పై నడిచేందుకు వీలు లేకపోవడంతోనే రోడ్డుపై నడిచి వెళ్లాడని, దీంతోనే ప్రమాదం జరిగిందని, వ్యక్తి మృతికి సంబంధిత నగరపాలక సంస్థ నిర్లక్ష్యమేనని వాదించారు. ఇందుకు సుప్రీం సైతం ఏకీభవించింది. ఫుట్‌పాత్‌లు నడకదారికి మాత్రమే ఉపయోగించాలని హెచ్చరికలు జారీచేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అక్రమాలను పెంచి పోషిస్తున్నారు.

అక్కడ తొలగించారు.. ఇక్కడ పోషిస్తున్నారు

అలిపిరి నుంచి జూపార్క్‌ వెళ్లే మార్గంలో సుమారు 30 పేద కుటుంబాలు ఆక్రమణకు తావులేకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా దుకాణాలను గత పదేళ్లుగా నడిపేవారు. కొందరి స్వార్థంతో ఈ దుకాణాలను తొలగించేశారు. అదే ప్రాంతంలో రుయా నుంచి అలిపిరికి వెళ్లే మార్గం ఫుట్‌పాత్‌తోపాటు రోడ్డును పూర్తిగా ఆక్రమించేశారు. డబుల్‌ రోడ్డు కాస్త సింగిల్‌ రోడ్డుగా మారిపోయింది. అలాగే రైల్వేస్టేషన్‌ ముందు శ్రీనివాసానికి దక్షిణం వైపు, ఆర్టీసీ బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో రోడ్లు కుంచించుకుపోయాయి. ఇక్కడ అక్రమాలకు కూటమే నేతలు అండగా ఉండడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement