తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలో ఇప్పటివరకు 1.31 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిలో 1.01 లక్షల సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో సోలార్ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని సంస్థ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
వేగంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు
రైతులకు సకాలంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ సిబ్బందిని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ఖాన్, కే.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఎం.మురళికుమార్, సీహెచ్ రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం–కుసుమ్ పనులు వేగవంతం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కుసుమ్ పథకంలో భాగంగా ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ సూచించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


