తిరుపతి సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్‌ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఆదివారం ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంయుక్తంగా రాయలసీమ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో విద్యారంగ, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇస్తామని గద్దెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్కటి కూడా అమలుచేయలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి మొండిచేయి చూపారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో కనీస వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన 4,500 పాఠశాలలను తిరిగి ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ బి.డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి, జియోగ్రఫీ సబ్జెక్ట్ నిపుణుడు కొరప్రాటి జనార్ధన, దివ్యాంగ సేవ కేంద్రం వ్యవస్థాపకులు నెల్లూరు మునిలక్ష్మి, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏటీసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్, ప్రవీణ్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నదియా, నేతలు గ్రేస్, వివేక్, వెంకీ, తారక్, అశోక్ పాల్గొన్నారు.


