నిత్యావసరాల ధరల నియంత్రణలో కూటమి విఫలం
సామాన్యుడి నడ్డి విరిచేలా ఆకాశాన్నంటుతున్న ధరలు
నిత్యావసర ధరల పెంపుపై ప్లకార్డు
చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న
భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుడిపై బాదుడే బాదుడు అన్న విధంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచుతున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరల పెంపునకు నిరసనగా భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి గాంధీరోడ్డు మీదగా నాలుగుకాళ్ల మండపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. నిత్యావసరాలను బండిపై పెట్టుకుని బతుకు బండి భారం అంటూ తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పప్పులు, నూనెలు, చక్కెర, గ్యాస్ వంటి నిత్యావసరాల ధరల పెంపుపై ప్లకార్డులను చేతబట్టుకుని ‘ధరల పెంపుకు హద్దేలేదు .. పెంచే వారికి బుద్ధే లేదు ’ అంటూ నినదించారు.
బాబు వస్తే కరువే
బాబు వస్తే కరువు వస్తుందనడం ఎంత నిజమో, ధరలు ఆకాశాన్నంటుతాయనడం కూడా అంతే నిజమని భూమన అభినయ్ తెలిపారు. ప్రధానంగా దేశంలో విత్తనాల సమస్య తార స్థాయికి చేరిందన్నారు. నకిలీ విత్తనాలతో పంటలు సరిగా పండక, వేసిన పంటలకు సకాలంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పంటలు పండడంలేదంటూ చంద్రబాబు కొత్త నినాదాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటే వచ్చే ఏడాది సమస్య వస్తుందే తప్ప ఈ ఏడాది కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేతగాని తనం వల్లే రాష్ట్రంలో నిత్యావసరాల సంక్షోభం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై మేలుకోకపోతే వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వానికి నియంత్రణ లేదు
భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్లే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం తాము అధికారంలోకి వస్తే నిత్యావసర ధరల రెక్కలు విరిచేస్తానంటూ చంద్రబాబు మాయమాటలు చెప్పి వంచించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముందుగా సివిల్ సప్‌లైశాఖ మంత్రికి నిత్యావసర ధరల నియంత్రణపై పూర్తి అవగాహన లేదన్నారు. రెవెన్యూ, సివిల్ సప్‌లై, జీఎస్టీ విభాగం, చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధరల నియంత్రించాలన్న ఆలోచనే లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అభినయ్‌రెడ్డి, అనుచరులపై కేసు
తిరుపతి క్రైం : ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలపై భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా వద్ద భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులు ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమం కారణంగా ప్రజల సాధారణ రాకపోకలకు ఆటంకం కలిగింది. భక్తులకు అసౌకర్యం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


