కాణిపాకం: తిరుపతి జిల్లాలో దాదాపు 2,600 మెడికల్ షాపులు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 14 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన జనరిక్ దుకాణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 900 మెడికల్ షాపులు నడుస్తుండగా, వీటిలో కేవలం 9 జనరిక్ షాపులు మాత్రమే ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
లాభాలన్నీ వారి ఖాతాలోకే...
సాధారణంగా బ్రాండెడ్ మందులన్నీ కంపెనీ ప్రతినిధులు, సీ అండ్ ఎఫ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ తర్వాత రిటైలర్ల ద్వారా సుదీర్ఘమైన సరఫరా వ్యవస్థ దాటుకుని వినియోగదారుడికి చేరుతాయి. కానీ, జనరిక్ మందులు నేరుగా డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ల చేతికే అందుతాయి. ఈ ప్రక్రియలో లభించే భారీ లాభాల మార్జిన్‌ను వినియోగదారుడికి డిస్కౌంట్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. ఆ ప్రయోజనాలను మెడికల్ షాపుల యజమానులే నొక్కేస్తున్నారు.
జేబుకు చిల్లు!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో మాత్రమే అసలైన జనరిక్ మందులు, అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయనేది అధికారుల వాదన. అయితే అలాంటి పలు షాపుల్లో కూడా ప్రజలకు నిర్ణీత ధరలకు మందులు దొరకడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ ప్రైవేట్ షాపుల్లో మాత్రం జనరిక్ పేరుతో నాణ్యత లేని మందులను అంటగడుతూ సామాన్యుల జేబుకు చిల్లులు పొడుస్తున్నారు. ఇక అనుమతులు లేని షాపులు కూడా విచ్చలవిడిగా వ్యాపారం సాగిస్తుండడం గమనార్హం. కొందరు ఈ గోల్‌మాల్‌ను పసిగడుతున్నప్పటికీ ప్రశ్నించే నాథుడు కరువయ్యాడు.
ఇదిగో సాక్ష్యం
తిరుపతి నగరానికి చెందిన రెహమాన్ అనే ఓ వ్యక్తి ఎదుర్కొన్న అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన క్రమం తప్పకుండా వాడే రాబేసిక్ డీఎస్‌ఆర్ అనే మాత్రల షీట్‌ను ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో కేవలం రూ.35లకే కొనుగోలు చేసేవాడు. అయితే, ఇటీవల తిరుపతిలోని ఒక ప్రైవేట్ జనరిక్ షాపునకు వెళ్లగా.. అదే మాత్రల షీట్‌కు ఏకంగా రూ.175 వసూలు చేశారు. ఇతర ప్రాంతాల్లో రూ.35లకే లభించే మందులకు ఇక్కడంత రేటు ఏంటని నిలదీయగా.. కవర్ మీద రూ.177.15 ఉంది.. ధర అంతే ఉంటుంది అని షాపు నిర్వాహకుడు దురుసుగా సమాధానమిచ్చాడు. బాధితుడు గొడవకు దిగడంతో నీ వల్ల అయింది చేసుకోపో అంటూ సదరు వ్యాపారి బెదిరింపులకు తెగబడ్డాడు. కేవలం రెహమాన్ ఒక్కడే కాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా రోజువారీగా ఇలాంటి దగాకు గురవుతున్న బాధితులు కోకొల్లలుగా ఉన్నారు.
ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల్లోనూ అంతే
రాబేసిక్ డీఎస్‌ఆర్ అనే మాత్రల షీట్‌ను కొత్తగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో అడిగితే ఒక షాపులో రూ.88 చెప్పారు. మరో దుకాణంలో రూ.85 చెబుతున్నారు.
అధికారులు స్పందించేనా?
జిల్లా వ్యాప్తంగా వందలాది మెడికల్ షాపుల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి, షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీనిపై సంబంధిత శాఖ ఏడీ హరిప్రసాద్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రోగానికి మందు వేసుకుంటే నయమవుతుందని వచ్చే సామాన్యుడికి మెడికల్ షాపుల నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. మందుల బిల్లులతో చెమటలు పట్టిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ప్రాణభయాన్ని ఆసరాగా చేసుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రైవేట్ మందుల షాపుల యజమానులు దోపిడీకి తెరతీస్తున్నారు. నిబంధనలను నడిరోడ్డుపై పాతిపెడుతూ, వ్యాపారమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరలకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘జనరిక్’ ఆశయానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు.
బ్రాండెడ్ పేరుతో దోపిడీ....
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు జనరిక్ మెడికల్ షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నట్లు రోగులు, వారి సహాయకులు మండిపడుతున్నారు. ఇక రిటైల్ మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తూ అమాయక ప్రజలను నిలువునా దగా చేస్తున్నారు. ప్రైవేట్ షాపుల్లో అమ్మే జనరిక్ మందులపై స్పష్టమైన డిస్కౌంట్ నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ నిబంధనల ప్రకారం గరిష్ట ధర కంటే ఎక్కువకు అమ్మకూడదనే కనీస సూత్రాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు.


